Green Concrete Technology : ఇక సిమెంట్‌కు గుడ్‌బై?.. వరి పొట్టు, చెరకు బూడిదతో పటిష్ఠమైన ఇండ్ల నిర్మాణం.. తగ్గనున్న నిర్మాణ వ్యయం

Green Concrete Technology : ‘గ్రీన్ కాంక్రీట్’ టెక్నాలజీ అమలుతో సిమెంట్ వినియోగం తగ్గి, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో నిర్మాణ రంగం మరింత పర్యావరణహితంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Green Concrete Technology

Green Concrete Technology : పంట పొలాల్లో ఉత్పత్తుల సేకరణ అనంతరం పనికిరావని భావించి తగలబెట్టే వరి పొట్టు, చెరకు వ్యర్థాలు ఇకపై బలమైన ఇళ్ల నిర్మాణానికి ఉపయోగపడనున్నాయి. వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే ప్రత్యేక బూడిదను సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించే ‘గ్రీన్ కాంక్రీట్’ సాంకేతికతను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీంతో నిర్మాణ ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Also Read : Hormuz Strait Closed Again : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మళ్లీ హర్మూజ్‌ను మూసేసిన ఇరాన్.. వైమానిక దాడులతో విరుచుకుపడ్డ అమెరికా

వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేస్తూ పర్యావరణహితమైన, పటిష్ఠమైన నిర్మాణాలు చేపట్టవచ్చునని భారతీయ శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. పొలాల్లో వరి పొట్టు, చెరకు పిప్పి వంటి వ్యవసాయ అవశేషాలను ప్రత్యేక థర్మో-కెమికల్ ప్రక్రియ ద్వారా శుద్ధిచేసి తయారయ్యే బూడిదను కాంక్రీట్ తయారీలో వినియోగించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ఈ బూడిదలో సిలికా అధికంగా ఉండటంతో సిమెంట్ గట్టిపడే లక్షణాలను ఇది పెంచుతుంది. దీంతో కాంక్రీట్ తయారీలో ఉపయోగించే సిమెంట్ పరిమాణాన్ని 10 నుంచి 20 శాతం వరకు తగ్గించి, ఆ స్థానంలో వ్యవసాయ బూడిదను కలపవచ్చు. దీనివల్ల కాంక్రీట్ బలం ఏమాత్రం తగ్గకపోగా, భవనాల మన్నిక మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ సాంకేతికత వల్ల నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. అదే సమయంలో పొలాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టాల్సిన అవసరం లేకపోవడంతో వాయు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ తయారీ వల్ల భారీ స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ (CO₂) వాతావరణంలోకి విడుదలవుతోంది. సాధారణంగా ఒక టన్ను సిమెంట్ తయారీకి దాదాపు ఒక టన్ను CO₂ ఉద్గారమవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.

అయితే ‘గ్రీన్ కాంక్రీట్’ టెక్నాలజీ అమలుతో సిమెంట్ వినియోగం తగ్గి, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో నిర్మాణ రంగం మరింత పర్యావరణహితంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.