Hormuz Strait Closed Again : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మళ్లీ హర్మూజ్‌ను మూసేసిన ఇరాన్.. వైమానిక దాడులతో విరుచుకుపడ్డ అమెరికా
Hormuz Strait Closed Again : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మరోసారి క్లోజ్ చేసింది.
US vs Iran war
Hormuz Strait Closed Again : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్ చర్యకు అమెరికా సైన్యం భారీ వైమానిక దాడులతో ప్రతిస్పందించింది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వాతావరణం మరింత తీవ్రతమవుతుండగా.. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో అమెరికా గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసిన తరువాత.. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడుల్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా కేంద్రాలు సహా మొత్తం 140 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అయితే, దాడుల అనంతరం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది.. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
మరోవైపు, అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. దక్షిణ తీరంలోని పలు సైనిక స్థావరాలు, టెలికమ్యూనికేషన్ టవర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా మొదటి దశలో జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ స్థావరంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, MQ-9 డ్రోన్ హ్యాంగర్లను ధ్వంసం చేశామని పేర్కొంది.
అలాగే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపై కూడా క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగించినట్లు తెలిపింది. బహ్రెయిన్, ఖతార్ లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేపట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్ లలోని యూఎస్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధ డిపో, రాడార్ స్థావరాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే.. క్షిపణి దాడులతో బహ్రెయిన్ అంతటా సైరన్ లు మోగుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇదిలా ఉండగా, అనుమతి లేని మార్గంలో ప్రయాణించిన ఓ నౌకను అడ్డుకున్న తర్వాత హోర్ముజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా నుంచి మరిన్ని దాడులు జరిగితే తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇటీవల మూడు వాణిజ్య చమురు ట్యాంకర్లపై జరిగిన దాడుల తర్వాత అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఇక అమల్లో లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఒప్పందాన్ని ఉల్లంఘించింది అమెరికానేనని ఇరాన్ ఆరోపిస్తోంది.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
