Dhanush Political Entry : రాజకీయాల్లోకి హీరో ధనుష్..! డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యలతో తమిళనాడులో ఆసక్తికర చర్చ.. అసలేం జరుగుతుంది?

Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సినీ స్టార్ ధనుష్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన వ్యాఖ్యలు తమిళనాట సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.

Dhanush Political Entry

Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు మరో సినీ స్టార్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అదే హీరో ధనుష్! ఇప్పటికే స్టార్ హీరో విజయ్ టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా.. ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదేక్రమంలో డీఎంకే ఎంపీ కనిమొళి ధనుష్‌ పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆమె చేసిన ఒక్క వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

Also Read : FlyDubai Plane : ఫ్లైదుబాయ్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి ఘటన.. వెలుగులోకి వచ్చిన వీడియో.. అసలేం జరిగిందంటే?

తమిళనాడు రాజకీయాల్లో సినిమా, రాజకీయాల అనుబంధం కొత్తది కాదు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్ వంటి సీని ప్రముఖులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా.. విజయ్ కూడా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తమిళనాడుకు చెందిన మరో స్టార్ హీరో ధనుష్ సైతం రాజకీయాల్లోకి వస్తున్నారని కొద్దికాలంగా చర్చ జరుగుతుంది. ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. గత కొద్దిరోజుల క్రితం రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. ధనుష్ సమాధానం ఇవ్వకుండా గట్టిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం కూడా ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలను పెంచింది.

జూలైలో అభిమానుల కార్యక్రమంలో ధనుష్‌ మాట్లాడుతూ.. సినిమా వేడుకలకే అభిమానుల ఐక్యతను పరిమితం చేయకుండా సంక్షేమ కార్యక్రమాలవైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ధనుష్ పిలుపుతో ఆయన అభిమాన సంఘాలు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం, కొత్త సభ్యులను చేర్చుకోవాలని అభిమాన సంఘం నుంచి వచ్చిన పిలుపులు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే చర్చకు మరింత ఊతమిచ్చాయి. అంతేకాక ధనుష్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో ‘తలైవర్ ధనుష్’ అనే పదాన్ని ఉపయోగించడం కూడా చర్చకు దారితీసింది.

ఈ పరిణామాలన్నీ ఒకెత్తు అయితే.. ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన వ్యాఖ్యలు ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై మరింత చర్చకు దారితీశాయి. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కనిమొళి విజయ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ ధనుష్ నటించిన వేల్లెల్ల పట్టదారి (వీఐపీ) సినిమాను గుర్తు చేశారు. వేల్లెల్ల పట్టదారీలకు రూ.4వేలు వచ్చాయా? రాలేదు.. ధనుష్ మాత్రం రాజకీయాల్లో వచ్చేశారు.. అంటూ కనిమొళి చేసిన వ్యాఖ్య ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

తమిళనాడులో విజయ్‌కు భారీగా ప్రజాధరణ ఉంది. ధనుష్‌సైతం దాదాపు అదేస్థాయిలో ప్రజాధరణ కలిగిన హీరోగా కొనసాగుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత.. ధనుష్ సైతం రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, కనిమొళి ధనుష్ పేరును విజయ్ పై రాజకీయ విమర్శలోకి తీసుకురావడం యాధృచ్ఛికంగా జరగలేదని.. కావాలనే ఆమె ధనుష్ పేరును తెరపైకి తెచ్చారని తమిళనాడు చర్చ జరుగుతుంది. ధనుష్ రాజకీయాల్లో వస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. కనిమొళి చేసిన వ్యాఖ్యలతో ధనుష్‌ను ఒక్కసారిగా విజయ్‌కు ప్రత్యామ్నాయ సినీ ముఖంగా రాజకీయ చర్చలోకి తీసుకొచ్చినట్లయిందన్న చర్చ జరుగుతుంది.

మరోవైపు.. ధనుష్‌ను డీఎంకే పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుందని, అందుకే కనిమొళి విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ధనుష్ పేరును తెరపైకి తెచ్చారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా? వస్తే.. సొంతంగా కొత్త పార్టీ పెడతారా? లేక ఏదైనా రాజకీయ పార్టీతో కలిసి అడుగులు వేస్తారా? అన్నది మాత్రం మున్ముందు ఆయన తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.