త్రివేండ్రం : కేరళలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు సతమతమవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఎండల తీవ్రతకు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది.
వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. 40 డిగ్రీల సిల్సీయస్ అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతుంది. చాలా సమస్యలను కలిగిస్తుంది. వడదెబ్బ అత్యంత ప్రమాదకరం… దీనిపై శ్రద్ధ తీసుకోవాలి. వెంటనే చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యంతో చికిత్స చేయకుండా వదిలేస్తే.. మెదడు, గుండె, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. చికిత్స చేయించుకోవడం వాయిదా వేసినా లేదా ఆలస్యం చేసినా వడదెబ్బ బాధితుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. సంక్లిష్టంగా మారి ప్రమాదాన్ని పెంచుతుంది. మరణం కూడా సంభవించవచ్చు.