యూపీ : మహాత్మా గాంధీ.. సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు. శాంతియుతంగానే బ్రిటీషర్లతో సుదీర్ఘ పోరాటం చేసి వారి నుంచి
యూపీ : మహాత్మా గాంధీ.. సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు. శాంతియుతంగానే బ్రిటీషర్లతో సుదీర్ఘ పోరాటం చేసి వారి నుంచి భారతీయులకు స్వేచ్ఛ కల్పించారు. ప్రపంచానికి కొత్త దారి చూపిన మహాత్ముడాయన. అందుకే గాంధీయిజం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పాఠమైంది. ఆ మహానుభావుడు మనకు ‘జాతిపిత’ అయ్యారు. 2019, జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీ వర్థంతి రోజు. 1948లో సరిగ్గా ఇదే రోజున ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు.
జాతిపిత 71వ వర్థంతి రోజున దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలకు అందరూ ఘన నివాళి అర్పించారు. బాపూజీ చూపిన మార్గాన్ని అనుసరించాలని సందేశం ఇచ్చారు. ఓవైపు దేశం మొత్తం జాతిపితను స్మరిస్తుంటే.. అలీఘర్‌లో మాత్రం రివర్స్ జరిగింది. విశ్వహిందూ పరిషత్ సభ్యులు గాంధీ వర్థంతి రోజున సంబరాలు చేసుకున్నారు. గాంధీ చిత్రపటాన్ని బొమ్మ తుపాకీతో కాల్తున్నట్టు ఫోజు ఇచ్చారు. గాంధీని చంపిన గాడ్సేని మాత్రం ఘనంగా పూజించారు. గాడ్సే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
గాంధీ చిత్రపటాన్ని ఓ వ్యక్తికి తగిలించి, ఆ వ్యక్తి బొమ్మతుపాకీని గురిపెట్టారు. గాడ్సేని మాత్రం ఘనంగా పూజించారు. స్వీట్లు కూడా పంచిపెట్టారు. ఎందుకిలా చేశారు అని అడిగితే.. దేశ విభజనకు గాంధీనే కారణం అని హిందూ మహాసభ నేషనల్ సెక్రటరీ పూజా శకున్ పాండే అంటున్నారు. మహాత్మా గాంధీ వల్లే దేశం రెండు ముక్కలైందని ఆమె మండిపడ్డారు. మహాత్మా గాంధీపై తమకున్న వ్యతిరేకతను ఈ విధంగా చూపామని చెబుతున్నారు.