Gokulpuri
Fire Accident in Delhi: ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలు ఉన్న ప్రాంతంలో.. అర్థరాత్రి మంటలు అంటుకున్నాయి. ఘటనలో.. 30 గుడిసెలు పూర్తిగా తగలబడిపోయాయి. ఏడుగురు సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. మరింతమంది తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం అందుతోంది.
అర్థరాత్రి అంటుకున్న మంటలపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారేసరికి మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై.. ఢిల్లీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గోకుల్ పురి ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. మంటల్లో తీవ్ర గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన.. ప్రమాదవశాత్తూ జరిగిందా.. వెనక ఎవరైనా ఉన్నారా.. అన్నది తేలాల్సి ఉంది.
ఉన్నట్టుండి హఠాత్తుగా అంటుకున్న మంటలు.. గోకుల్ పురి గుడిసె వాసుల్లో భయాందోళనలు కలిగించాయి. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. చూస్తుండగానే అంటుకున్న మంటలు.. ఏడుగురిని సజీవ దహనం చేయడంతో.. బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.