ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్‌ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా
ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్‌ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా క్రికెట్ దేశాలు సంబంధాలు తెంచుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఇటువంటి అంశాల్లో ఐసీసీ జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పింది. బహిష్కరణ అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయమంది. బీసీసీఐకి కూడా ఈ విషయం తెలుసని, అయితే ఏమన్నా అవకాశం ఉంటుందేమోనన్న ఉద్దేశంతో ఈ లేఖ రాసి ఉంటుందని పేర్కొన్నారు.
శనివారం(ఫిబ్రవరి-2-2019) జరిగిన త్రైమాసిక బోర్డు సమావేశంలో చర్చించిన గవర్నింగ్ బాడీ సభ్యులు.. బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయడం చాలా కష్టమని మీడియాకు తెలిపారు. క్రికెట్‌నే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని, రాజకీయ సంక్షోభాలకు ఐసీసీలో తావులేదని తెలిపారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చాలా దేశాల ఆటగాళ్లు ఆడుతున్నారని, ఆ దేశాలేవీ ఇటువంటి ప్రతిపాదన చేయలేదని మనోహర్ అన్నారు. ఆటగాళ్ల భద్రత గురించి మాత్రం కొంత ఆందోళనగా ఉందన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. పుల్వామా దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ టీమిండియా మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి తర్వాత.. త్వరలో జరిగే వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు, అధికారుల భ్రదత, క్షేమం గురించి బీసీసీఐ ఆందోళన చెందుతుందని, భారత్‌లో జరిగిన ఉగ్రదాడిని ఐసీసీలోని చాలా సభ్యదేశాలు (బ్రిటన్ సహా) ఖండించాయని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని క్రికెట్ ప్రపంచాన్ని కోరుతున్నామని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి లేఖలో కోరారు. అయితే ఈ లేఖలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమనే ప్రస్తావించారు తప్పా ఎక్కడా పాకిస్తాన్ అని పేర్కొనలేదు.