దేశంలో రెండో అతి పెద్ద రంగమైన బ్యాంకింగ్‌లో కొత్తకోణం. డబ్బులు లెక్కపెట్టేందుకు రోబోలు రంగంలోకి దిగనున్నాయి. నోట్ల లెక్కింపులో హెచ్చుతగ్గులు లేకుండా చూసేందుకు రోబోలు వాడనున్నట్లు ఐసీఐసీఐ బుధవారం ప్రకటించింది. ఈ రకమైన మెషీన్ స్టాఫ్‌ను వాడుకునే తొలి భారత బ్యాంక్‌గా ఐసీఐసీఐ చరిత్ర సృష్టించనుంది.
12నగరాల్లో ఉన్న బ్రాంచ్‌లకు 14 రోబోలను తీసుకున్నామని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, జైపూర్, ఛండీఘర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, భోపాల్, సంగ్లీ, మంగళూరు, రాయ్‌పూర్, సిలిగురి, వారణాసిలలో సంవత్సరానికి 1.8బిలియన్ నోట్లు లెక్కించాల్సి వస్తుందట. అంటే రోజుకు 60లక్షల నోట్లు లెక్కించాలన్నమాట.
నోట్ల రద్దు తర్వాత కూడా పాత నోట్లను చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 3వేల 975నోట్లు దొరికిపోయాయి. ఇలాంటి వాటిని కనుగొనే ఫీచర్‌ను ఈ రోబోలలో ఇన్‌స్టాల్ చేశారు. నోట్లను లెక్కించి వాటి నాణ్యతను బట్టి ట్రేలలో విడిగా ఉంచుతాయన్నమాట. నోటు బాగా నలిగి ఉందా.. చెలామణికి సరిపోతుందాననేది అవే సొంతగా విశ్లేషిస్తాయట.
ఐసీఐసీఐ బ్యాంకు తీసుకొచ్చిన వినూత్న టెక్నాలజీ అన్ని బ్యాంకులలో వాడితే నల్ల ధనాన్ని అదుపుచేయడంతో పాటు పనులు వేగవంతమవుతాయని యాజమాన్యం తెలిపింది. ప్రైవేటు బ్యాంకులన్నీ రోజు మొత్తం జరిగిన లావాదేవీలు సాయంత్రానికి కూడా కూర్చొని ఫినిష్ చేసుకోవడం, డబ్బుల లెక్కల్లో అవకతవకలు ఇకపై ఉండవన్నమాట.