India Pakistan Navy Ship Collision : అరేబియా సముద్రంలో ఉద్రిక్తత.. భారత యుద్ధనౌకపైకి దూసుకొచ్చిన పాక్ నేవీ షిప్.. రంగంలోకి విదేశాంగ శాఖ
India Pakistan Navy Ship Collision : ఉత్తర అరేబియా సముద్రంలో అనూహ్య భద్రతా పరిణామం చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Published on- September 16, 2026 / 02:00 PM IST
india pakistan navy ship collision arabian sea
India Pakistan Navy Ship Collision : ఉత్తర అరేబియా సముద్రంలో అనూహ్య భద్రతా పరిణామం చోటు చేసుకుంది. అంతర్జాతీయ జలాల్లో సాధారణ నిఘా గస్తీ నిర్వహణ విధుల్లో ఉన్న భారత నావికాదళానికి చెందిన ఒక యుద్ధనౌకను పాకిస్థాన్ నావికాదళానికి చెందిన నౌక అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఊహించని పరిణామంతో సముద్రంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
భారత నావికాదళ యుద్ధనౌక అంతర్జాతీయ జల సరిహద్దుల్లో నిబంధనల ప్రకారం తన భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. అయితే, మంగళవారం సాయంత్రం సమయంలో భారత యుద్ధ నౌక ఉన్న ప్రాంతంకు పాకిస్థాన్ నేవీకి చెందిన ఓ నౌక వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే భారత యుద్ధనౌక వైపు దూసుకొచ్చి.. చివరి నిమిషంలో నౌకను తిప్పడంతో రెండు నౌకలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, నౌకల నష్టం వాటిల్లనప్పటికీ సముద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా పాక్ నేవీ వ్యవహరించడంతో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
పాకిస్థాన్ నౌకాదళ యూనిట్ వ్యవహరించిన తీరు అంగీకరించలేనిది, నిబంధనలకు విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సముద్రంలో సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఒప్పందాల నిబంధనలను గౌరవించాలని పాక్ దౌత్యవేత్తకు సూచించినట్లు తెలిపింది.
ఈ ఘటనపై న్యూఢిల్లీలోని పాకిస్థాన్ అత్యున్నత దౌత్య ప్రతినిధికి భారత విదేశాంగ శాఖ బుధవారం ఉదయం అత్యవసర సమన్లు జారీ చేసింది. దౌత్య మార్గాల ద్వారా ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తిన భారత్.. పాకిస్థాన్ నావికాదళం వ్యవహరించిన అజాగ్రత్త, ప్రమాదకర తీరుపై తన నిరసనను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో గస్తీ తిరిగే నౌకల భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
