లడఖ్ పై చైనా వాదనను తోసిపుచ్చిన భారత్…1959 LAC ఒప్పందాన్ని భారత్ అంగీకరించలేదన్న విదేశాంగ శాఖ

India rejects-China’s position on Ladakh వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా వితండ వాదనను భారత్ ఖండించింది. లడఖ్ లోని పలు భూభాగాలు తమవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపుతూ చైనా విదేశాంగ చేసిన ప్రకటనను మంగళవారం(సెప్టెంబర్-29,2020) భారత్ తోసిపుచ్చింది.


1959 నాటి ఎల్ఏసీ ఒప్పందం ప్రకారం లడఖ్ లోని పలు భూభాగాలు తమవేనని చైనా వాదించగా.. అసలు ఆ ఒప్పందానికి భారత్ అంగీకరించలేదని, నాటి ఒప్పందం ఇద్ద‌రికీ ఆమోద‌యోగ్యంగా జ‌ర‌గ‌లేద‌ని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎల్ఏసీ సరిహద్దులను మార్చేందుకు డ్రాగ‌న్ దేశం చాలా కాలంగా నిరంత‌రంగా ప్రయత్నిస్తున్నదని, ఇదే విషయాన్ని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం పార్లమెంటులో నివేదించారని విదేశాంగ శాఖ గుర్తుచేసింది.


అంతేకాకుండా, ఎల్ఏసీ అంశంలో ఏర్ప‌డ్డ ప్ర‌తిష్టంభ‌న‌లు తొల‌గించేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోంటే, చైనా మాత్రం ఏకపక్షంగా అనుచిత వైఖరిని ప్రదర్శిస్తున్నదని మండిపడింది. ఎల్ఏసీ వెంబడి శాంతియుతంగా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు 1993లో కుదిరిన ఒప్పందం, 1996లో ఖరారైన.. సైనిక రంగంలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఒప్పందం(సీబీఎం), సీబీఎం అమలు.. ప్రోటోకాల్స్ కు సంబంధించి 2005లో కుదుర్చుకున్న అంగీకారాలను చైనా అడుగడుగునా ఉల్లంఘిస్తూ వస్తున్నదని భారత్ ఆరోపించింది. గత ఒప్పందాలు, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా రెండు దేశాలు కలిసి ఎల్ఏసీని ధృవీకరించుకోవాలేగానీ, భారత్ అంగీకరించని 1959 ఒప్పందం ప్రకారం ప్రాంతాలను తమవిగా చైనా చెప్పుకోవడం అభ్యంతరకరమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు