Paper Leak Law: ఇక పేపర్ లీకేజీలకు చెక్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా
పేపర్ లీకేజీలకు(Paper Leak Law) పాల్పడే దోషులకు ఏకంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరుస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- July 24, 2026 / 05:38 PM IST
Indian govt implementing neet paper leak strict law 10 crore fine 10 years jail
- పదేళ్ల వరకు కఠిన జైలు
- పది కోట్ల భారీ జరిమానా
- మూడు నెలల్లోనే కేసు పూర్తి
Paper Leak Law: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది. కాక్‌రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉధృత ఆందోళనలతో ఈ అంశం తీవ్రరూపం దాల్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రజల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిని అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే లీకేజీ ముఠాల ఆటకట్టించేందుకు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సరికొత్త, అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది.
పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా – కొత్త చట్టంలో కఠిన నిబంధనలు:
కేంద్రం రూపొందిస్తున్న కొత్త చట్టం ప్రకారం పేపర్ లీకేజీలకు(Paper Leak Law) పాల్పడే దోషులకు ఏకంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరుస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా వెల్లడించారు. విద్యార్థులకు వేగంగా న్యాయం జరిగేలా రోజువారీ ప్రాతిపదికన విచారణ జరిపి, కేవలం మూడు నెలల నిర్దిష్ట కాలపరిమితిలోనే కేసులను పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో 3 నుండి 5 ఏళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా మాత్రమే ఉండగా, వ్యవస్థీకృత నేరాలకు పదేళ్ల జైలు, రూ.కోటి జరిమానా ఉండేది. ఇప్పుడు ఆ శిక్షలను మరింత కఠినతరం చేస్తూ సమగ్ర సవరణలతో కొత్త బిల్లును రూపొందించారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు – వచ్చే వారమే పార్లమెంట్‌లో బిల్లు:
ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, పేపర్ లీకులను అరికట్టేందుకు కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి చట్టాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. లీకేజీ కేసుల త్వరితగత విచారణ కోసం ఇప్పటికే ఢిల్లీలో ఒక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కాగా, త్వరలోనే మరో నాలుగు కోర్టులను అందుబాటులోకి తేనున్నారు. పేపర్ లీకేజీ నిరోధక కొత్త బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే, అది కూడా వచ్చే వారంలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ చట్టం అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో పోటీ పరీక్షల లీకేజీలకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
