Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జరిమానాలు భారీగా పెంపు.. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అంతే సంగతులు!
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, రైళ్ల(Indian Railways)లో క్రమశిక్షణను పెంచడంపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
- V Santhosh Kumar
- Updated on- June 22, 2026 / 08:45 PM IST
Indian Railways major changes in rules and regulations, also increased the fines
- రైల్వే జరిమానాలు భారీగా పెంపు.
- స్మోకింగ్ చేస్తే కఠిన చర్యలు.
- లేడీస్ బోగీల్లో పురుషులకు నిషేధం.
Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, రైళ్లలో క్రమశిక్షణను పెంచడంపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాత నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారికి విధించే జరిమానాలను భారీగా పెంచింది. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ(Indian Railways) తీసుకున్న కీలక నిర్ణయాలు కొత్త జరిమానాల వివరాలు ఇవే.
రైళ్లలో స్మోకింగ్‌పై ఉక్కుపాదం:
రైల్వే ప్రాంగణాల్లో, కోచ్‌లలో ధూమపానం (స్మోకింగ్) చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇటీవల ప్రయాణికుల నిర్లక్ష్యం వల్ల, రైళ్లలో స్మోకింగ్ చేయడం, ప్రమాదకర పదార్థాలు రవాణా చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. దీనిని అరికట్టేందుకు రైల్వే శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై రైలులో స్మోకింగ్ చేస్తూ పట్టుబడితే రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు.
మహిళల భద్రతకు పెద్దపీట:
మహిళా ప్రయాణికుల రక్షణను పెంచేందుకు, వేధింపులను అరికట్టేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక బోగీల్లో (లేడీస్ కంపార్ట్‌మెంట్) పురుషులు ప్రయాణిస్తే ఇకపై రూ.2,500 జరిమానా విధిస్తారు. రైల్వే భద్రతా సిబ్బంది, టికెట్ చెకింగ్ సిబ్బంది రాత్రి వేళల్లో, రద్దీ సమయాల్లో ఈ బోగీలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.
వినా టికెట్ ప్రయాణానికి భారీ పెనాల్టీ:
రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్యను తగ్గించేందుకు జరిమానాను రెట్టింపు చేశారు.ఈమేరకు గతంలో ఉన్న కనీస జరిమానా రూ.250ని ఇప్పుడు రూ.500కు పెంచారు. ఇంకా, ఎవరైనా సరైన టికెట్ లేకుండా లేదా తప్పుడు టికెట్‌తో ప్రయాణిస్తే, అసలు టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అక్రమ వ్యాపారాలు, భిక్షాటనపై నిషేధం:
రైళ్లలో అనుమతి లేకుండా వస్తువులు విక్రయించడం (హాకింగ్), భిక్షాటన చేయడం పూర్తిగా నిషేధించబడింది. రైల్వే చట్టాల ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, భారీ జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
