India GDP Growth : భారత ఆర్థిక వ్యవస్థ దూకుడు.. తొలి త్రైమాసికంలో 7.8శాతం జీడీపీ వృద్ధి.. నిజంగానే అంత గొప్ప విషయమా..?

India GDP Growth : భారత్‌ ఆర్థిక వృద్ధి గత ఏడాదితో పోలిస్తే మరింత వేగం పుంజుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 6.9శాతం వృద్ధితో పోలిస్తే.. ఈసారి 7.8 శాతానికి చేరింది.

India GDP Growth

India GDP Growth : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఇది ఆర్థిక సంస్థల అంచనాలను మించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7.0 శాతం, మార్కెట్ అంచనాల్లో ఉన్న 7.3 శాతాన్ని కూడా భారత్ అధిగమించింది.

Also Read : Gold Silver Price Today : గోల్డ్ ప్రియులకు బిగ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

భారత్‌ ఆర్థిక వృద్ధి గత ఏడాదితో పోలిస్తే మరింత వేగం పుంజుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 6.9శాతం వృద్ధితో పోలిస్తే.. ఈసారి 7.8 శాతానికి చేరింది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్‌ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధరలు బ్యారెల్‌కు 87 నుంచి 90 డాలర్ల వరకు పెరిగాయి. అయినప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడకుండా వాణిజ్య విధానాలు, ఇంధన నిల్వలు కొంతమేర రక్షణగా నిలిచాయి. మరోవైపు.. యూరియా ధరలు ఏకంగా 73.5శాతం పెరిగినప్పటికీ, ప్రభుత్వ జోక్యంతో వ్యవసాయ రంగానికి అందించిన మద్దతు కారణంగా ఈ ప్రభావాన్ని కొంత మేర నియంత్రించగలిగింది. దీంతో స్థానిక సరఫరా వ్యవస్థలపై ద్రవ్యోల్బణ భారం తీవ్రంగా పడకుండా చూడగలిగింది.

దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు తగినంత నిధులు అందుబాటులో ఉండటం ఆర్థిక వృద్ధికి కీలకంగా మారింది. మధ్యతరహా పరిశ్రమలకు రుణాల పంపిణీలో మరింత భారీ వృద్ధి నమోదైంది. ఈ రంగానికి అందించిన రుణాలు 30.3 శాతం పెరిగాయి. పరిశ్రమల విస్తరణ, కొత్త పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

అత్యంత అనిశ్చిత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో సైతం గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్మాణాత్మక సంస్కరణల ఫలితంగానే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బలంగా నిలదొక్కుకోగలుగుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాల పరంగా రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఉండొచ్చని, అయితే, ప్రస్తుతం బలమైన దేశీ వినియోగం, ఎగుమతుల పనితీరుతో మరో త్రైమాసికంలో పటిష్టమైన వృద్ధి సాధ్యపడిందని పేర్కొంటున్నాురు.

అయితే ఈ వృద్ధి వెనుక అసలు పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం ఉందని The Wire విశ్లేషణ పేర్కొంది. కేవలం జీడీపీ వృద్ధి రేటును చూసి ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని తేల్చడం సరైంది కాదని తెలిపింది. ప్రస్తుత వృద్ధిలో ప్రభుత్వ వ్యయం, మౌలిక సదుపాయాల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషించింది. దీర్ఘకాలిక వృద్ధికి ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ పెట్టుబడులు కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సాధారణ ప్రజల వినియోగ సామర్థ్యం, ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరుగుతున్నాయా అన్నది కీలకం. జీడీపీ పెరిగినా దాని ప్రయోజనాలు అన్ని వర్గాలకు సమానంగా చేరుతున్నాయా అనేది మరో ప్రశ్నగా మారింది. మొత్తంగా కేవలం 7.8 శాతం ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా దూసుకుపోతోందని తేల్చడం తొందరపాటు నిర్ణయమేనని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.