Petrol Price : యుద్ధ ఎఫెక్ట్.. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..! ఎంత పెరుగుతాయో తెలుసా.. వామ్మో.. దిమ్మతిరిగిపోవాల్సిందే
Iran-Israel war : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వారంరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో త్వరలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
- Harishth Thanniru
- Published On : March 3, 2026 / 08:57 AM IST
Iran-Israel war Petrol Price
- తీవ్రమవుతోన్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్
- మరో వారంరోజులు ఇదేపరిస్థితి ఉంటుందన్న ట్రంప్
- భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్
Petrol Price : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. మరో వారంరోజుల పాటు యుద్ధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : Iran-Israel war : యుద్ధంలోకి మరికొన్ని దేశాలు.. చినికి చినికి వరల్డ్ వార్ అవుతుందా?
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేస్తోంటే.. ప్రతిగా ఇరాన్ సైతం అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడం వల్ల భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావంతో చమురు ధర పెరుగుతుండటంతోపాటు ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
అమెరికా వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 3.19 శాతం పెరిగి 67.29డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ 72.87 డాలర్లకు చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధర బ్యారెల్ కు 100 డాలర్లను తాకుతుందని బార్ క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. ధర ఈ స్థాయికి చేరితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధర రూ. 10వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతదేశ ముడి చమురు అవసరాల్లో 88శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. మనదేశం రోజుకు 5.5. మిలియన్ బ్యారెళ్ల చమురును వాడుతుంది. ఇందులో రెండు మిలియన్ బ్యారెళ్లు హార్ముజ్ జలసంధి మీదుగానే వస్తోంది. క్రూడ్ ధర ఒక్క డాలర్ పెరిగినా.. ఏటా ప్రభుత్వంపై రూ.13వేల కోట్ల భారం పడుతుంది. గత ఏడాది మన దేశం 160 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ ను కొనుగోలు చేసింది.
ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు ఎగిసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 77డాలర్లకు చేరువైనా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటెయిల్ ధరలు సమీపకాలంలో పెరగకపోవచ్చునని విశస్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే.. హార్ముజ్ జలసంధిలో రవాణా బంద్ అయితే భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్ తో పాటు వంట నూనెలపైనా యుద్ధం ప్రభావం పడుతుంది. 16 మిలియన్ టన్నుల వంట నూనె దిగుమతుల్లో పొద్దుతిరుగుడు పువ్వు నూనెవాటా 20శాతం. రష్యా, యుక్రెయిన్, అర్జెంటీనా నుంచి ఈ దిగుమతులు ఎర్ర సముద్రం అవల నుంచి తీసుకురావాలంటే ఎక్కు వ్యయాలు అవుతాయి. యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఎరువుల ధరలుసైతం పెరిగే అవకాశం ఉంది. జూన్ లో ఖరీఫ్ సీజను ప్రారంభం కావడానికి ముందు డీఏపీ, ఎస్ఎస్‌పీ ఎరువుల తయారీలో కీలకమైన సల్ఫర్, సల్ప్యూరిక్ యాసిడ్ సరఫరా పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత సల్ఫర్ దిగుమతుల్లో ఖతార్, యూఏఈ, ఒమన్ కు 76శాతం వాటా ఉంది.
