GSLV F14, INSAT 3DS mission
జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. వాతావరణాన్ని అంచనా వేయడం, విపత్తు నిర్వహణకు సేవలు వాడుకోవడం వంటి వాటి కోసం ఇస్రో అభివృద్ధి చేసిన ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్14 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.
మన ఉపగ్రహాల ద్వారా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి రేపు సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. మొత్తం 27.5 గంటల పాటు కౌంట్ డౌన్ ఉంటుంది. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు జరిగాయి.
జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ తో ఈ రాకెట్ ను రూపొందించారు. భారత్ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు జీఎస్ఎల్వి రాకెట్లు అవసరమయ్యాయి. ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జీఎస్ఎల్వి రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది.
విప్లవాత్మక మార్పులు
ఆ విధంగా స్వదేశీ పరిజ్ఞానంతో 10వ సారి క్రయో దశను ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం సమాచార రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ తరహా రాకెట్లు అవసరమయ్యాయి. శనివారం ప్రయోగించే ఉపగ్రహం కూడా అటువంటి ప్రయోజనాత్మకమైనదే.
ఈ రాకెట్ 19 నిమిషాలలోగానే నిర్ణీత అంతరిక్ష కక్ష్యకు చేరేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. ఇస్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల సాయంతో మూడేసి చొప్పున గగన్ యాన్‌కు సంబంధించి ఏడు పరీక్షలు కూడా చేస్తుంది.
Also Read: కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన సినిమా ఇది.. ఇక ఆయన సినిమా ఖతం: చంద్రబాబు