×
Ad

ISRO: ఇస్రో మరో ఘనత.. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్

Isro LVM3-M6 BlueBird launch : ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం

Isro LVM3-M6 BlueBird

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం విజయవంతం అయింది. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC- షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ఈ బాహుబలి రాకెట్ LVM3-M6 (లాంచ్ వెహికల్ మార్క్-3 M6)ని విజయవంతంగా ప్రయోగించింది.

Also Read : AP Government : ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్.. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం.. రెడీగా ఉండండి..

అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను రాకెట్ మోసుకెళ్లింది. తొలుత ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. అయితే, సాంకేతిక కారణాల రిత్యా 90 సెకన్ల పాటు వాయిదా వేశారు. ఉదయం 8.55 గంటలకు ఎల్వీఎం3-ఎం6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి లాంచ్ అయిన 15 నిమిషాల తరువాత బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో విజయవంతంగా చేరుకుంది. వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండటం, గాలి వేగం తక్కువగా ఉండటం, మేఘాలు లేకపోవడం.. ఇవన్నీ ఈ ప్రయోగానికి పాజిటివ్ అంశాలుగా మారాయి.

ఈ ప్రయోగం విజయవంతంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ.. బాహుబలి ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. భారత భూమి నుంచి నింగికెగిరిన అతిభారీ రాకెట్ ఇదే. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని తెలిపారు. ఇస్రో ప్రస్తుతం 34దేశాలకు సేవలందిస్తోంది. ఇస్రో చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. గగన్‌యాన్ కోసం సిద్ధమవుతోన్న వేళ ఈ ప్రయోగం విజయవంతం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోందని నారాయణన్ అన్నారు.

బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ఉపగ్రహం నుంచి నేరుగా మొబైల్ కెనెక్టివిటీ అందించాలనే లక్ష్యంగా బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ చేపట్టారు. దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఏ సమయానికైనా, ఎవరికైనా 4జీ, 5జీ వాయిస్, వీడియో కాల్స్, సందేశాలు, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది.