Aravalli Hills Controversy: ఆరావళి చుట్టూ రాజకీయం.. పర్యావరణవేత్తల ఆందోళన ఎందుకు? ఉత్తర భారతానికి పొంచి ఉన్న ముప్పు ఏంటి?
మన దేశంలో అత్యంత పురాతనమైన పర్యతశ్రేణి ఆరావళి. ఇది 250 కోట్ల ఏళ్ల క్రితం నాటివని చెప్తారు.
Aravalli Hills Controversy: ఢిల్లీ చుట్టూ ఉన్న ఆరావళి పర్వతాల దగ్గర మైనింగ్ కి అనుమతి ఇవ్వడంతో ప్రారంభమైన రగడ తీవ్రస్థాయికి చేరింది. కంపెనీల లాభం కోసమే ఇలా ఆరావళి పర్వతాల నిర్వచనమే మార్చేశారని ప్రతిపక్షాలు నేతలు, పర్యావరణవేత్తలు ఆందోళనకి దిగారు. కేంద్రం మాత్రం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న వాటిని పర్వతాలు అనరని.. అసలు ఆరావళి జోలికి తాము వెళ్లడం లేదని వాదిస్తోంది. దీంతో రాజకీయ రగడకి తోడు.. పర్యావరణ కోణంలోనూ
ఆందోళనలకి తావిస్తోంది.
మన దేశంలో అత్యంత పురాతనమైన పర్యతశ్రేణి ఆరావళి. ఇది 250 కోట్ల ఏళ్ల క్రితం నాటివని చెప్తారు. గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు ఈ పర్వతాలు విస్తరించగా.. అసలు ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి ఇసుక తుఫాన్లు.. ధూళి వగైరా రాకుండా పెట్టని కోటలా కాపాడుతున్నాయంటారు. అసలు ఎడారులు ధార్ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుపడింది కూడా ఈ పర్వతాలే. ఈ పర్వతాలలో అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ పర్వతాల్లోనైనా అరుదైన జీవ జాతులు నిక్షేపాలు ఉంటాయ్. వాటి కోసం అన్వేషణలో భాగంగా ఈ సంపద అంతా నాశనం చేస్తున్నారు.
పర్వాతలకు కేంద్రం కొత్త నిర్వచనం..
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 100 మీటర్ల కంటే ఎత్తు తక్కువ ఉన్న ఏ కొండలనైనా మైనింగ్ చేసుకోవచ్చంటూ.. మౌంటైన్.. అంటే పర్వతాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. దీంతో మైనింగ్ కంపెనీలకు ఆరావళిలో దారి దొరికినట్లైంది. దీనిపైనే పీపుల్ ఫర్ ఆరావళీస్ అనే స్వచ్చంద సంస్థ ఆందోళనకి దిగింది.
ఇప్పటికే అక్రమ తవ్వకాలు, అభివృద్ధి పేరిట సాగుతున్న కట్టడాలతో… హరియానా, రాజస్థాన్‌లోని చార్ఖీ దాద్రి, భీవానీ జిల్లాల్లో ఆరావళి పర్వతాలు ధ్వంసమయ్యాయి. జీవ వైవిధ్యం నాశనమైంది. పరిస్థితి మరింత దిగజారితే ఉత్తర భారతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఆరావళిలో గనుల తవ్వకాలను సుప్రీంకోర్టు గతంలో నిషేధించినా, అక్రమ కార్యకలాపాలు మాత్రం ఆగలేదు. ఇప్పుడు పర్వతాలకు కొత్త నిర్వచనం ఇవ్వడంతో ఆరావళిలోని 90 శాతం ప్రాంతాలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే, దిల్లీ వరకు థార్ ఎడారి విస్తరించే ప్రమాదముంది. గాలి నాణ్యత మరింత దెబ్బతింటుంది. అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయని ‘పీపుల్ ఫర్ ఆరావళీస్’ హెచ్చరిస్తోంది.
ఈ ఏడాది జూన్ 5న స్వయంగా మోదీనే ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ ప్రారంభించగా.. ఇప్పుడిలా అసలు పర్వతాలంటే ఏంటంటూ కొత్త డెఫినిషన్ ఇవ్వడమే విమర్శలకు తావిస్తోంది. కేంద్రం మాత్రం ప్రతిపక్షాల ఆందోళనను తప్పుబడుతోంది. తాజా నిబంధనల వల్ల పర్వతాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలతో 90 శాతం పర్వతాలు సురక్షితంగా ఉంచుతామని భరోసా ఇస్తూ.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలకు అనుగుణంగానే పర్వత ప్రాంతాల రక్షణ జరుగుతోందని ప్రకటించింది. ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పని చేస్తామంటోంది కేంద్రం.
Also Read: భారత రాజ్యాంగంలో ‘హిందూ రాష్ట్రం’ అనే పదాన్ని చేర్చాలా? ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఏమన్నారు?
