Eknath Shinde: డ్రమ్స్ వాయిస్తూ షిండేకు ఘనస్వాగతం పలికిన ఆయన సతీమణి.. వీడియో వైరల్
అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే సీఎం పీఠం దక్కించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత షిండే తన సొంత నియోజకవర్గమైన థానేలోని తన స్వగృహానికి చేరుకున్నారు.
- Harish Thanniru
- Published on- July 6, 2022 / 03:17 PM IST
Cm Shinda
Eknath Shinde: అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే సీఎం పీఠం దక్కించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత షిండే తన సొంత నియోజకవర్గమైన థానేలోని తన స్వగృహానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా స్థానిక శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు షిండేకు ఘన స్వాగతం పలికారు. షిండే తన మద్దతు దారులైన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం రాత్రి ముంబై నుంచి థానేకు బస్సులో బయలుదేరారు. రాత్రి 9.30గంటల సమయంలో షిండే థానే చేరుకున్నారు. సీఎంను చూసేందుకు కార్యకర్తలు భారీ వర్షంలోను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. సుమారు నాలుగు గంటల పాటు స్వాగత ర్యాలీ జరిగింది.
కార్యకర్తలు, అభిమానులు కోలాహలం మధ్య షిండే రాత్రి పొద్దుపోయే సమయానికి థానేలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద శివసేన కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, బాణ సంచా కాల్చుతు సంబురాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో షిండే సతీమణి లతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన స్వగృహానికి రావడంతో ఆమెలో ఆనందం కట్టలు తెంచుకుంది. స్వయంగా లతా డ్రమ్స్ వాయించి భర్తకు ఘన స్వాగతం పలికింది. అయితే షిండేకు స్వాగతం పలుకుతూ ఆయన సతీమణి డ్రమ్స్ వాయించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
