జైషే మహ్మద్‌ లేఖ కలకలం : హిట్‌ లిస్ట్‌లో మోడీ, అమిత్‌షా, ధోవల్‌

  • Publish Date - September 25, 2019 / 05:40 AM IST

భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చిక్కిన జైషే మహ్మద్‌ లేఖ కలకలం రేపుతోంది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల కుట్రకోణం మొత్తం… ఈ లెటర్‌ ద్వారా వెలుగులోకి వచ్చిందన్న ఐబీ…  ఐఎస్‌ఐతో కలిసి జైషే మహ్మద్ పేలుళ్లకు కుట్ర పన్నిన్నట్లు తెలిపింది. 

దేశవ్యాప్తంగా 30చోట్ల పేలుళ్లు జరిపేందుకు జైషే ఉగ్రవాదులు పథకరచన చేశారని… ప్రధానంగా లక్నో, కాన్పూర్‌, గాంధీనగర్‌ ఎయిర్‌ పోర్టులను పేల్చివేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారని అలర్ట్ చేసింది. అంతేకాదు.. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ కూడా జైషే హిట్‌ లిస్టులో ఉన్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని ఐబీ స్పష్టంచేసింది. అయితే జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను పాకిస్తాన్ రహస్యంగా విడుదల చేసినట్లు వార్తలు వచ్చిన కొద్దిరోజుల్లోనే… ఈ లేఖ బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకార చర్యగా ఉగ్రవాదులు ముఖ్యంగా దేశంలో 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చని, అలాగే కీలక రాజకీయ నేతలను కూడా టార్గెట్ చేస్తారని చెప్పి లేఖ సారాంశం ఉంది. ఇందులో భాగంగా కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ప్రధాన పట్టణాలు జమ్మూ, పఠాన్ కోట్, జైపూర్, గాంధీ నగర్, కన్పూర్, లక్నో సహా కీలక నగరాలకు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశాయి. ఎయిర్ పోర్టులు, ఆర్మీ ఎయిర్ బేసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

ప్రధానంగా ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాషిలో, అమిత్ షా నియోజకవర్గం గాంధీ నగర్ లోనూ లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కొద్దిరోజుల క్రితం నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పండుగ సీజన్ కావడంతో రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్షాలు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాయి. దేవాలయాలు, రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 

ప్రధానంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, దేశభద్రత సలహాదారుడు అజిత్ ధోవల్ జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అంశాల పట్ల కసరత్తు చేశారు. వీరే తమ హిట్ లిస్టులో ఉన్నారన్న అంశాన్ని లేఖలో వెల్లడించారు.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మసూద్ అజార్‌ను పాకిస్తాన్ ఇటీవలే విడుదల చేసింది. ఈకోణంలోనే భారత్ లో ఉగ్రదాడులకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక పన్నాగాన్ని పన్నుతున్నట్లుగా నిఘా వర్గాలకు సమచారం అందింది. దీంతో దేశంలో ఉన్న ప్రధాన పట్టణాలు, సెక్యూరిటీ వింగ్స్ అన్నింటినీ అప్రమత్తం చేశారు.