డ్రాగన్ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర విమర్శలు చేసింది. భారత్ – చైనా సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల విషయంలో చైనాను.. అమెరికా తప్పుపట్టింది. దక్షిణ చైనా సముద్రంలోనూ తన ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో చైనా వ్యవహారశైలి ప్రమాదకారిగా మారిందని అమెరికా ఆరోపించింది. భారత సరిహద్దుల్లోనూ చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని కామెంట్ చేసింది.
తరచూ భారత సైన్యంతో గొడవలకు దిగడం వెనుక వేరే కారణాలున్నాయని ఆరోపించింది. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కింలోని సరిహద్దుల్లోని లఢఖ్, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో భారత సైన్యాన్ని చైనా రెచ్చగొట్టడం, గొడవకు దిగడాన్ని అమెరికా తప్పు పట్టింది. చైనాతో జరిగిన ఘర్షణల్లో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఇదే సమయంలో తూర్పు లఢఖ్ లోకి చొచ్చుకొచ్చిన చైనా హెలికాప్టర్లను భారత బలగాలు తిప్పికొట్టాయి.
ఆ సమయంలో భారత్ సుఖోయ్-30 విమానాలను మోహరించింది. ఈ నేపథ్యంలోనే చైనా తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ విషయమై అమెరికా, చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా కోసం పనిచేస్తుందని అమెరికా ఆరోపించింది. దీనితో పాటు కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ విమర్శిస్తూనే ఉన్నారు.
సరిహద్దుల్లోని వివాదాలు కొన్నిసార్లు భౌతిక దాడులు, ఘర్షణలకు దారితీయడం కొత్తేం కాదని.. కాని చైనా ఆధిపత్యం చెలాయించేలా చూస్తోందని అమెరికా అంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వివిధ దేశాల మధ్య తలెత్తే వివాదాలు, ఉద్రిక్తతలను దౌత్య, త్రైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే.. చైనా మాత్రం ఆధిపత్య ధోరణి ప్రదర్శిసోందని విమర్శించింది. ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలను అందించే అంతర్జాతీయ వ్యవస్థను కోరుకుంటున్నామన్న అమెరికా.. అయితే సరిహద్దు వివాదాల విషయంలో చైనా బెదిరింపులకు గుర్తుచేస్తోందని అమెరికా అంటోంది.
ఇక పాకిస్థాన్ మీదుగా చైనా నిర్మిస్తోన్న చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌ని దోపిడీగా అమెరికా వర్ణించింది. ప్రాజెక్టులలో పారదర్శకత లేకపోవడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వాటిళ్లే నష్టం, ఆ దేశంలో వాణిజ్య అసమతౌల్యతకు దారితీస్తాయని అన్నారు.ఈ దోపిడీ వల్ల అన్యాయమైన రుణాలు పాకిస్తాన్‌కు భారంగా మారుతున్నాయని, దీనిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని అమెరికా తెలిపింది.