Ambubachi Mela : అంబుబాచీ మేళాకు సిద్ధమైన అసోం.. ఆ మూడ్రోజులు బ్రహ్మపుత్ర నదిలో నీళ్లు ఎందుకు ఎరుపెక్కుతాయి.. ప్రత్యేకత ఇదే..

Ambubachi Mela : అసోంలోని ప్రముఖ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయంలో నిర్వహించే అంబుబాచి మేళా -2026కు రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మేళా జరిగే సమయంలో మూడు రోజులపాటు అమ్మవారి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. అంతేకాదు.. ఆలయం పక్కనుంచి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిలోని నీళ్లు ఎరుపెక్కుతాయట.

Ambubachi Mela

Ambubachi Mela : అసోంలోని ప్రముఖ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయంలో నిర్వహించే అంబుబాచి మేళా -2026కు రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు భారతదేశంలో అత్యంత ప్రాధాన్యమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా ఈ మేళా గుర్తింపు పొందింది. జూన్ 22న ప్రవృత్తితో ప్రారంభయ్యే అంబుబాచి మేళా.. జూన్ 26న నివృత్తితో ముగియనుంది. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడి మూడు రోజులపాటు మూసివేయబడుతుంది.. ఈ ఏడాది మేళాకు 8లక్షల మందికిపైగా భక్తులు, సాధువులు, తాంత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : Hyderabad To Chennai High Speed Rail : అమరావతి మీదుగానే హైదరాబాద్‌- చెన్నై హైస్పీడ్‌ రైల్‌‌.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లోనే స్టేషన్లు..

అమ్మవారి దర్శనానికి అనుమతి ఉండదు..
గౌహతిలోని నీలాచల్ కొండపై ఉన్న చారిత్రాత్మక కామాఖ్య ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. ఇది 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి విగ్రహం ఉండదట. రాయినే అమ్మవారిగా పూజించడం ఇక్కడి ఆచారం. స్త్రీశక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానోత్పత్తి కలుగుతుందని, అష్తైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వాసం. హిందూ విశ్వాసాల ప్రకారం.. ఈ మేళా దేవీ కామాఖ్య వార్షిక రజస్వల చక్రానికి ప్రతీకగా భావించబడుతుంది. స్త్రీ శక్తి, సంతానోత్పత్తి, భూమాత పునరుత్పత్తి శక్తికి ఈ ఉత్సవం సంకేతంగా నిర్వహిస్తారు. సాధారణంగా పండుగ రోజుల్లో ఆలయాల్లోని దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ, కామాఖ్య ఆలయం ఇందుకు భిన్నం. ఈ మూడు రోజులపాటు గుడిని మూసేస్తారు.అ మ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించరు.

నదిలోని నీళ్లు ఎరుపెక్కుతాయట!
మేళా జరిగే సమయంలో మూడు రోజులపాటు అమ్మవారి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. కానీ, ఆలయం బయట భక్తులు మొక్కలు చెల్లించుకుంటారు. రుతుస్రావంలో ఉన్న అమ్మవారు ఈ సమయంలో మరింత శక్తిస్వరూపిణిగా మారుతారని, విశ్రాంతితో పునరుత్తేజితమవుతారని స్థానికుల విశ్వాసం. ఇక ఈ మూడు రోజులు అమ్మవారు రుతుచక్రంలో ఉన్నారనడానికి సంకేతంగా.. గుడిని ఆనుకొని ఉన్న బ్రహ్మపుత్ర నదిలోని నీళ్లు ఎరుపెక్కుతాయట. ఇలా మూడు రోజులు ముగిశాక గుడిని శుద్ధి చేసి, అమ్మవారికి మంగళస్నానం చేయించి.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆపై భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారట.

అదే ప్రసాదంగా..!
అంబుబాచీ మేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రత్యేక శిబిరాలు, తాత్కాలిక వసతి కేంద్రాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కామాఖ్య రైల్వే స్టేషన్, పాండు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అలాగే ప్రత్యేక దర్శనం కోసం ఆఫ్‌లైన్ కౌంటర్లను నిలిపివేసి, ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పాస్‌లు జారీ చేయనున్నారు. సాధారణ దర్శనం మాత్రం ఉచితంగానే కొనసాగుతుందని ఆలయ యాజమాన్యం వెల్లడించింది. ఆలయం తిరిగి తెరిచిన రోజున భక్తులకు పవిత్రమైన ఎర్రటి చిన్న వస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేస్తారు. దీన్ని స్వీకరించడం పవిత్రంగా భావిస్తారు. దీనివల్ల తమకు సంతానోత్పత్తి భాగ్యం కలుగుతుందని నమ్ముతారని అక్కడి వారు చెబుతారు.