హోం క్వారంటైన్ లో కమల్ హాసన్, ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే..

ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోం క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లో ఉన్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీనికి కారణం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు

  • Publish Date - March 28, 2020 / 09:19 AM IST

ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోం క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లో ఉన్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీనికి కారణం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు

ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోం క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లో ఉన్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీనికి కారణం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు చేసిన పనే. అధికారులు కమల్ ఇంటికి హోం క్వారంటైన్ స్టిక్కర్ అతికించడం దుమారం రేపింది. తమ అభిమాన నటుడికి ఏమైంది? కరోనా బారిన పడ్డాడా? అని కమల్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కట్ చేస్తే, అలాంటిదేమీ లేదని స్వయంగా కమల్ హాసన్ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అవన్నీ రూమర్స్ అని కమలే స్పష్టం చేశారు. అంతేకాదు, అధికారులు కమల్ ఇంటికి అతికించిన హోం క్వారంటైన్ స్కిక్టర్ ని తొలగించేశారు.

ఆల్వార్‌పేట్‌లో కమల్ ఇంటికి ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌:
చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లో ఉన్న కమల్ హాసన్ ఇంటికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌ను అతికించారు. ఆ తర్వాత కాసేపటికి ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ లోపలే ఆ సమాచారం అభిమానులకు చేరింది. హోం క్వారంటైన్ స్టిక్కర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమ హీరోకు ఏమైందో అని ఫ్యాన్స్ భయపడ్డారు. ఎంక్వైరీలు మొదలుపెట్టారు. ఈ విషయం కమల్ వరకు చేరింది. దీంతో ఆయన స్పందించారు. అభిమానులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.

హోం క్వారంటైన్ అవాస్తవం అన్న కమల్:
‘‘నా ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల నేను క్వారంటైన్‌లో ఉన్నానని ఒక వార్త వ్యాపించింది. అలాంటిదేమీ లేదు. కొన్నేళ్లుగా ఆ ఇంట్లో నేను ఉండటం లేదు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీస్ గా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్‌లో ఉన్నానని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. అంతేకాదు ముందు జాగ్రత్తగా, కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ తెలిపారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఆ భవనం కమల్ ఇల్లు కాదు:
‘కొన్ని రోజులుగా కమల్ భారత్ లోనే ఉంటున్నారు. ఏ దేశానికి వెళ్లలేదు. 2020 జనవరి నుంచి కమల్ హాసన్ స్వదేశంలో ఉంటున్నారు, విదేశాలకు వెళ్లలేదు. అధికారులు స్టిక్కర్ అంటించిన ఆ భవనం కమల్ ఇల్లు కాదు. పార్టీ ఆఫీస్ ది. అక్కడ సెక్యూరిటీని ఒక్క మాట కూడా అడక్కుండా, విచారణ చేయకుండానే కార్పొరేషన్ అధికారులు స్టిక్కర్ అతికించారు’ అని మక్కల్ నీది మయ్యం పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

తాతాల్కిక హాస్పిటల్ గా కమల్ నివాసం:
కరోనా వైరస్ సోకిన వారికి వైద్యం అందించడానికి తన ఇంటిని తాత్కాలిక హాస్పిటల్‌గా మార్చడానికి తాను సిద్ధమని కమల్ హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఏ ఇల్లు అనే విషయంలో కమల్ క్లారిటీ ఇవ్వలేదు. బహుశా అది ఆల్వార్‌పేట్ ఇల్లే కావచ్చని అనుకుంటున్నారు. తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉందని ఇప్పటికే కమల్ కూతురు, హీరోయిన్ శృతిహాసన్ ప్రకటించింది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన శృతిహాసన్.. తాను, తన తల్లి సారిక ముంబైలో వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నామని చెప్పారు. అలాగే, తన తండ్రి కమల్ హాసన్, చెల్లెలు అక్షర చెన్నైలోని వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నారని చెప్పింది.

దుబాయ్ నుంచి వచ్చిన కమల్ మాజీ భార్య:
ఇక హోం క్వారంటైన్ స్టిక్కర్ గందరగోళంపై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు స్పందించారు. విదేశాల నుంచి వారిని గుర్తించి వారి ఇంటి గోడలకు హోం క్వారంటైన్ స్టిక్కర్ అతికించడం ప్రక్రియలో భాగమే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసారం ఇలా చేస్తున్నామని చెప్పారు. కమల్ మాజీ భార్య గౌతమి ఇటీవలే దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చారని వారు తెలిపారు. ఆమె పాస్ పోర్టు మీదున్న అడ్రస్ ప్రకారమే అల్వార్ పేట్ లో ఉన్న ఆ భవనానికి హోం క్వారంటైన్ స్టిక్కర్ అతికించామన్నారు. ఇందులో తమ తప్పు ఏమీ లేదని వారు వివరించారు. ఆ తర్వాత అది కమల్ హాసన్ పార్టీ ఆఫీస్ అని తెలిసి, స్టిక్కర్ ను తొలగించామని చెప్పుకొచ్చారు.

Also Read | కరోనా ఎఫెక్ట్, కల్లు దొరక్క వ్యక్తి మృతి, కొందరు పిచ్చోళ్లయ్యారు