Kanpur vendor loses both legs after he was hit by a train; was recovering his supplies thrown on tracks by cops
Kanpur Vendor: పోలీసుల దురుసు ప్రవర్తన ఓ కూరగాయల వ్యాపారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేంది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే ఆ వ్యాపారి తన రెండు కాళ్లనూ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో జరిగిన ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చిరువ్యాపారులు చాలా సాధారణ విషయమే. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందనో, రోడ్డును ఆక్రమించుకుని పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారనో పోలీసులు అప్పుడప్పుడు వారిని వెళ్లగొడుతూ ఉంటారు.
ఆ క్రమంలో కొంత దురుసుగా ప్రవర్తిస్తుంటారు. కొంత అతి చేస్తుంటారు. ఇలాగే కాన్పూర్ పోలీసులు కూడా అతికి పోయి ఓ కూరగాయల వ్యాపారి రెండు కాళ్లు కోల్పోవడానికి కారణమయ్యారు. అడిషనల్ డీసీపీ లఖన్ యాదవ్ కథనం ప్రకారం.. రోడ్డు పక్కనున్న దుకాణాలను తొలగించేందుకు పోలీసులు రావడంతో వ్యాపారులందరూ త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేయాలనే తొందరలో ఉన్నారు. కూరగాయలు విక్రయించే ఇర్ఫాన్ అలియాస్ లడ్డూ(20) కూడా ఆ పనిలో బిజీగా ఉన్నాడు.
అయితే ఈ తొందరలో అతడి కాంటా రైల్వే ట్రాకుపై పడింది. ఒకవైపు పోలీసుల తొందర, వెంటనే తెచ్చుకుని రోడ్డు ఖాళీ చేయాలనే తొందరలో రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. అదే సమయంలో ఆ ట్రాకుపై రైలు వస్తోంది. ఈ విషయాన్ని లడ్డూ గమనించలేదు. లడ్డూ ట్రాకుపైకి వెళ్లడం రైలు రావడం.. దీంతో అది అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో అతడు రెండు కాళ్లు కోల్పోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.
అయితే ప్రత్యక్ష సాక్షులు తెలిపే కథనం మరోలా ఉంది. జీటీ రోడ్డును ఆక్రమించుకుని దుకాణాలు పెట్టుకున్నారంటూ అక్కడికి చేరుకున్న పోలీసులు ఇర్ఫాన్ కూరగాయలు, కాంటా, ఇతర సామాన్లను రైల్వే ట్రాక్ పైకి విసిరేశారు. దీంతో ట్రాక్‌పైకి పరిగెట్టిన ఇర్ఫాన్ వాటిని ఏరుకుంటుండగా వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టిందని తెలిపారు. అది చూసిన పోలీసులు ఇర్ఫాన్‌కు సాయం అందించాల్సింది పోయి అక్కడి నుంచి పరుగులు పెట్టి క్షణాల్లోనే మాయమయ్యారట. ఆ తర్వాత విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఇర్ఫాన్‌ను ఎల్ఎల్ఆర్ ఆసుపత్రికి తరలించినట్టు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గుదలకు అదే అసలు కారణమట
ఒక వైపు ఈ వ్యాపారుల నుంచి దందా చేస్తూనే మరోవైపు జులుం చూపిస్తున్నారట పోలీసులు. వ్యాపారుల నుంచి పోలీసులు రోజుకు రూ. 50 వసూలు చేస్తున్నారని, అయినప్పటికీ వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక కొడుకు అలా జరగడంపై లడ్డూ తండ్రి ఆటో డ్రైవర్ అయిన సలీమ్ అహ్మద్ దుఖాన్ని వెల్లగక్కాడు. తన కుమారుడి కాళ్లు రెండు ఘటనా స్థలంలోనే తెగి పడ్డాయని, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించే సమయంలో పోలీసులు కొంత సంయమనంతో వ్యవహరించి ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.