UP Woman : తనతో మాట్లాడాలంటూ వివాహితపై దాడి.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆస్పత్రికి మహిళ.. ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన
UP Woman : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖ్‌బాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీపక్ అనే వ్యక్తి తనతో మాట్లాడాలి అంటూ వివాహితకు నిప్పంటించారు.

UP Woman Nisha Singh
UP Woman : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫరూఖ్‌బాద్‌లో నిషా సింగ్ అనే మహిళపై కొందరు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తుండగా ఆమెను అడ్డగించి నిప్పంటించారు. మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ సదరు మహిళ ఆస్పత్రికి వెళ్లింది. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆగస్టు 6వ తేదీన రాష్ట్ర రాజధాని లక్నో నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరూఖాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు నిషా సింగ్ (33) వివాహిత. గత నెల 6వ తేదీన ఆమె తన తండ్రి ఇంటికి వెళ్లింది. కొంతకాలంగా దీపక్ అనే వ్యక్తి తనతో మాట్లాడలంటూ ఆమెను వేధిస్తున్నాడు.
ఆగస్టు 6వ తేదీన ఆమె స్కూటీపై వైద్యుడి వద్దకు వెళ్తుండగా తన స్నేహితులతో కలిసి దీపక్ ఆమెను అడ్డగించాడు. ఆ సమయంలో దీపక్, నిషా సింగ్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో దీపక్, అతని స్నేహితులు ఆమెకు నిప్పంటించారు. ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ మంటల్లో కాలుతూనే తన స్కూటీపై ఫ్యామిలీ డాక్లర్ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడ చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది.
బాధితురాలి తండ్రి బలరామ్ సింగ్ మాట్లాడుతూ.. డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. త్వరగా రండి మీ కుమార్తె చాలా కాలిపోయిందని చెప్పాడు. నేను ఆందోళనతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నా. అప్పటికే ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. నాన్నా నన్ను కాపాడు.. నాన్నా నన్ను కాపాడు అని పెద్దగా కేకలు వేసింది. అక్కడి వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. ఇదంతా ఎలా జరిగిందని ప్రశ్నించగా.. దీపక్ తనకు నిప్పంటించాడని చెప్పింది. తనతో మాట్లాడాలని, కలవాలని అతను ఆమెను ఒత్తిడి చేసేవాడు అని బాధితురాలి తండ్రి బలరామ్ సింగ్ చెప్పాడు.
బాధితురాలి సోదరి నీతు సింగ్ మాట్లాడుతూ.. దీపక్ మా సోదరి నిషా సింగ్‌ను కొంతకాలంగా వేధిస్తున్నాడని తనకు తెలుసు. కానీ, తమ తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. దీపక్ మా సోదరిని అనేకసార్లు ఇబ్బంది పెట్టాడు. నాతో మాట్లాడు అంటూ మా సోదరిపై ఒత్తిడి చేసేవాడు. కానీ, నిషాకు అతనితో మాట్లాడటం ఇష్టం లేదు. ఈ విషయాలు మా అమ్మకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు మాత్రమే తెలుసు అని నీతు సింగ్ చెప్పింది. అయితే, తన భార్య దీపక్ నుంచి ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటుందని తన భర్తకు కూడా తెలియదు.
మృతురాలి భర్త అమిత్ చౌహాన్ మాట్లాడుతూ.. నిషా సింగ్ నాతో ఎప్పుడూ ఈ విషయం గురించి చెప్పలేదు. నాకు చెప్పిఉంటే ఆమెకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు అంటూ కన్నీటి పర్యాంతమయ్యాడు.