91 ఏళ్ల యువకుడు : రోజుకు ఎనిమిది గంటలు పొలంలోనే

  • Publish Date - October 24, 2019 / 09:29 AM IST

రైతే దేశానికి వెన్నెముక అన్నారు పూజ్య బాపూజీ.  ఆ మాటల్ని అక్షరాల అమలు చేస్తున్నారు కర్ణాటక కలుబుర్గికి చెందిన 91 సంవత్సరాల రైతు బసవనప్ప పాటిల్. నేటి తరం ఏసీ రూముల్లో కూర్చుని పనిచేస్తూ కూడా అలిసిపోతున్నామంటూ ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో మలిసంధ్యలో కూడా గంటల తరబడి పొలంలో పనిచేస్తు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు బసవవనప్ప.

ప్రతీ రోజు పొలంపని చేయటం మానని బసవనప్ప ఒక్కరోజు పొలానికి వెళ్లకపోయినా తోచదంటారు. పొలం నా జీవితంలో భాగమైపోయిందని ఎంతో సంతోషంతో చెబుతున్నారు.

91 సంవత్సరాల వయస్సులో కూడా మీరు ఇంత చలాకీగా వ్యవసాయ పనులు ఎలా చేయగలుతున్నారు అని అడిగితే చిరునవ్వు నవ్వేస్తూ..ఈ మట్టితో నాకు ఎలలేని బంధం ఏర్పడిపోయిదంటారు. నేను రైతును అని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉందనీ..పొలం పనిచేసేటప్పుడు నా వయస్సు నాకు ఏమాత్రం గుర్తుకు రాదంటారు. 
రోజు ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా వ్యవసాయ పనులు చేసినా నాకు ఏమాత్రం అలసటే లేదంటారు. 

ఈరోజు ఈ పని అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకుని సకాలంలో విత్తులు వేసింది మొదలు పంట చేతికి వచ్చేదాకా కష్టించి పనిచేస్తాననీ అన్నారు. తనకు ఆరుగురు పిల్లలున్నారనీ..కానీ ఏ ఒక్కరూ కూడా వ్యవసాయం పని అంటే ఇష్టపడరనీ ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయం అంటే తనకు ప్రాణం అంటారాయన. 

ఇంత వయస్సులో కూడా ఇంత ఆరోగ్యం మీరు ఎలా ఉన్నారు అని అడిగితే..ప్రతీ రోజు మట్టిలో పనిచేయటం..రోజు రోటీలు, స్వచ్ఛమైన పాలు, పెరుగే నా ఆహారం అని అదే నా ఆరోగ్య రహస్యం అని నవ్వుతూ చెప్పేస్తారు బసవనప్ప.  నేటి తరం యువకులంతా ఉద్యోగాలు చేయటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు..మీరు వారికి ఏమన్నా మెజేస్ ఇవ్వాలనుకుంటున్నారా అని అడిగితే మనం చెబితే మాత్రం వారు వింటారా అంటారు 91 ఏళ్ల రైతు బసవనప్ప పాటిల్.