Kalaburagi Blast : భార్యపై కోపంతో దారుణానికి పాల్పడిన భర్త.. ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు..

Kalaburagi Blast : భార్య తనమాట వినడం లేదన్న కోపం.. కుటుంబం పరువు పోతోందన్న ఆవేదనతో భర్త దారుణానికి పాల్పడ్డాడు.

Kalaburagi Blast

Kalaburagi Blast : భార్య తనమాట వినడం లేదన్న కోపం.. కుటుంబం పరువు పోతోందన్న ఆవేదనతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. నడుముకు జిలెటిన్ స్టిక్స్ కట్టుకొని పేల్చుకోవడంతో అతనితోపాటు అతని కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ పేలుడు ఘటనలో భార్య, కొడుకుతోపాటు ఇద్దరు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read : 19 Wanted Terrorists : ఆగస్టు 15 వేళ ఢిల్లీలో హై అలర్ట్.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల.. ఎవరెవరంటే?

శివలాల్ బలీరామ్ రాఠోడ్, సవిత భార్యాభర్తలు. వారిద్దరికి కుమార్తె మీరా (15), కుమారుడు ప్రకాశ్ (12) ఉన్నారు. అయితే, కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భార్యపై శివలాల్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన కారణంగా కుటుంబ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తుండేవాడు. భర్త ఇబ్బందులు తాళలేక సవిత భర్తను విడిచి పిల్లలతో కలిసి కలబురగి జిల్లా ఆళంద్‌ తాలూకాలోని మటకి తాండాలో బంధువు సురేఖ చౌహాన్ ఇంటికి వెళ్లింది. కొద్దిరోజులుగా అక్కడే ఉంటుంది.

శివలాల్‌ మంగళవారం జిలెటిన్‌ స్టిక్స్ ను నడుముకు కట్టుకుని వారింటికి వెళ్లాడు. అక్కడే పేల్చుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. శివలాల్ క్వారీలో పనిచేసేవాడని, అక్కడి నుంచి పేలుడు పదార్థాన్ని ఇంటికి తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో గొడవ జరిగిన తర్వాత పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనలో ఇంటి కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం.

పేలుడు శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.