కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జెఎన్ గణేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈగల్టన్ రిసార్ట్స్‌లో ఎమ్మెల్యే గణేష్ తనపై దాడి చేశాడని ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడి ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే గణేష్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై కర్నాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఆధ్వర్యంలో నిజనిర్దారణ కమిటీ వేశారు. ఆ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు గణేష్‌పై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.
”అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఆర్థిక సాయం ఎందుక చేయలేదని ఎమ్మెల్యే గణేష్ నాతో గొడవ పెట్టుకున్నాడు. నా చెల్లిని, కొడుకుని, కుటుంబ సభ్యులను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను కిందకు తోసేశాడు. నా ముఖంపై కాలితో తన్నాడు. నా కళ్లు, ముక్కు వాచాయి. దాడిలో నేను స్పృహ కోల్పోయాను. ఇంతలో ఇతర ఎమ్మెల్యేలు తూకారామ్, రఘుమూర్తి, రామప్ప, తన్విర్ వచ్చి నన్ను కాపాడారు. లేదంటే నేను బతికి ఉండేవాడిని కాను. నాకు స్పృహ వచ్చే సమయానికి అపోలో ఆస్పత్రిలో ఉన్నాను” అని ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పాడు.
ఈ ఎఫ్ఆర్ఐతో కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారనే వార్తలు నిజమే అని తేలింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ పార్టీకి చెందిన 76మంది ఎమ్మెల్యేలను 2019, జనవరి 19వ తేదీ శనివారం బెంగళూరు శివారులోని ఒక రిసార్ట్‌కు కాంగ్రెస్ పెద్దలు తరలించారు. అయితే అక్కడ ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తలపై మరో ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ మద్యం బాటిల్‌తో కొట్టడంతో ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ తోసిపుచ్చారు. ఛాతిలో నొప్పిగా ఉండటంతోనే ఆనంద్‌ను ఆస్పత్రికి తరలించామని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్వయంగా ఆనంద్ ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు దిగజారిపోయాయని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలన్నారు.