కమల్‌హాసన్‌తో కలిసి పనిచేస్తానన్న రజినీకాంత్

  • Publish Date - November 19, 2019 / 03:50 PM IST

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తమిళ స్టార్లు రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నారు. రజినీకాంత్‌ ఓకే అంటే.. అతనితో కలిసి పనిచేసేందుక రెడీ అంటూ ముందుగా కమల్‌ హాసన్‌ ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకు రజినీకాంత్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కమల్‌హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యంతో పొత్తుకు రెడీ అంటూ అంగీకారం తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే, కమల్‌హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం.. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. సీట్లు గెలవకపోయినప్పటికీ.. చెప్పుకోదగ్గ ఓటింగ్‌ మాత్రం వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్‌హాసన్‌ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారు. ఇందులో భాగంగానే రజినీకాంత్‌ ముందుకొస్తే.. ఆయనతో పొత్తు పెట్టుకోడానికి రెడీ అంటూ ప్రతిపాదన పెట్టారు. దీనికి రజినీకాంత్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

రెండు రోజుల క్రితం రజినీ కాంత్‌ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగబోతున్నాయని చెప్పుకొచ్చారు. జయలలిత చనిపోయిన తరువాత పళనిస్వామి సీఎం అవుతారని, ఆయన ఇంతకాలం పదవిలో కొనసాగుతారని ఎవ్వరూ ఊహించలేదని రజినీకాంత్‌ కామెంట్‌ చేశారు. అలాగే, రేప్పొద్దున సీఎం సీటు కూడా దక్కబోతోందంటూ రజినీకాంత్‌ తన మనసులో మాట చెప్పారు. నిన్న ఎడపాటి.. రేపు రజినీకాంత్‌ అంటూ తన స్టైల్‌లో పంచ్‌లు విసిరారు రజినీ.