అవసరం ఉన్నా లేకున్నా కొంతమంది రోడ్డు మీదకు వస్తే చాలు వాహనాల హారన్ కొట్టి చికాకు పెట్టేస్తారు. అయితే ఈ హారన్ కొట్టడం అనేది తీవ్ర శబ్ద కాలుష్యానికి కారణం అవుతుంది. ఈ శబ్ద కాలుష్య తీవ్రత తగ్గించేందుకు పశ్చిమబంగలోని ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ప్రాంతం కోల్‌కతాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు ‘నో హాంకింగ్’ డ్రైవ్‌ను నిర్వహించారు. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ డ్రైవ్ ద్వారా కోల్‌కతా నగరంలోని ముఖ్యప్రాంతాల్లో ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు 3వేల మందికి పైగా వాహనదారులకు ఫైన్ విధించారు.
ఈ డ్రైవ్ ద్వారా శబ్ద కాలుష్యంకి కారణం అవుతున్న వాహనదారులకు రూ.100 జరిమానా విధించారు. ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు సాగనుంది. ఇప్పటి వరకు మొత్తం 3,150 మందిపై జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధాకారులు వెల్లడించారు. డ్రైవ్ ప్రారంభించిన మొదటి రోజున 955 మందికి జరిమానా విధించగా.. మొత్తం 700 ప్రాంతాల్లో డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు మోటర్ వాహన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని వారికి పాయింట్లు కూడా యాడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అవసరం లేకుండా కూడా హారన్ ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని, అలాగే ఇది మానసికంగా, శారీరకంగా మనిషిపై ప్రభావం చూపుతుందని, మనిషిలో ఒత్తిడి పెంచుతుందని, వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చస్తున్నారు. అందుకే అవసరమైతే తప్ప హారన్ కొట్టొద్దు అని బోర్డులు కూడా పెడుతున్నారు అధికారులు.