Madurai Train Fire Accident
Tamil Nadu : మధురై నగరంలోని రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పది మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. రైలు బోగీల్లో టీ చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం. (Fire accident in train coaches in Madurai) గాలి వేగంతో రైలు కోచ్‌లలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించడంతో పాటు 20 మందికి గాయాలయ్యాయి. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై రైల్వేశాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది.
Madhurai Train Fire Accident : మధురై రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం, 9 మంది మృతి
పదిహేను రోజుల పర్యటనకోసం..
దక్షిణాదిలో ఆధ్యాత్మిక దర్శనంకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నుంచి ప్రైవేట్ పార్టీ కోచ్ (టూరిస్ట్ రైలు) ఆగస్టు 17న బయలుదేరింది. ఆదివారం చెన్నైకి చేరుకొని అక్కడి నుంచి తిరిగి లక్నోకు రైలు తిరిగి వెళ్లాల్సి ఉంది. సుమారు 15 రోజుల పర్యటన కోసం లక్నో నుంచి ప్రయాణికులతో ఈ రైలు బయలుదేరింది. రైలులో సుమారు 65 మంది యాత్రికులు ఉన్నారు. శుక్రవారం నాగర్ కోయిల్ జంక్షన్ వద్ద దీన్ని పునలూరు-మదురై ఎక్స్‌ప్రెస్ రైలుకు అటాచ్ చేశారు. తమిళనాడు నాగర్ కోయిల్ లోని పద్మనాభస్వామి ఆలయంలో దర్శనం చేసుకొని శనివారం రాత్రి మదురై రైల్వే స్టేషన్‌కు కొద్దిదూరంలో దీన్ని డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైన్‌లో నిలిపి ఉంచారు.
అగ్ని ప్రమాదానికి కారణమేమిటి?
మధురై రైల్వేస్టేషన్ వద్ద పర్యాటకుల రైలు ప్రమాదానికి కారణాలను మదురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత వివరించారు. ట్రైన్‌లో టీ తయారు చేసుకునేందుకు ప్రయాణికుల్లో ఒకరు గ్యాస్‌స్టవ్ వెలిగించడంతో రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయని ఆమె తెలిపారు. ప్రయాణీకులు గ్యాస్ సిలీండర్‌ను అక్రమంగా రైలులోకి తీసుకెళ్లారు. టీ తయారు చేస్తుండగా అది ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయని తెలిపారు. దక్షిణ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బి. గుగనేశన్ మాట్లాడుతూ.. రైలులో సిలీండర్‌ను అక్రమంగా తీసుకెళ్లారని, దీనిపై టీ తయారుచేస్తుండగా మంటలు చెలరేగాయని తెలిపారు.