వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త: 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఏయే రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉందంటే?
ఈ రైళ్లకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

Vande Bharat Train
Vande Bharat Ticket Rules: ప్రయాణికులకు భారతీయ రైల్వే ఒక శుభవార్తను అందించింది. ఇకపై, ఎంపిక చేసిన 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో, రైలు మీ స్టేషన్‌కు రావడానికి కేవలం 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ప్రయాణికుల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త నియమం ఏమిటి?
రైల్వే ప్రయాణీకుల రిజర్వేషన్ సిస్టమ్ (PRS)లో చేసిన మార్పుల ద్వారా ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
గతంలో: రైలు బయలుదేరిన స్టేషన్ నుంచి కదిలిన తర్వాత, మధ్యలోని స్టేషన్లలో (రూట్ స్టేషన్లు) కరెంట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యమయ్యేది కాదు.
ఇప్పుడు: ఈ కొత్త నిబంధనతో (Vande Bharat Ticket Rules), 8 వందే భారత్ రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను మధ్యలోని స్టేషన్లలో కూడా, రైలు రావడానికి 15 నిమిషాల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు.
ఈ మార్పు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, రైళ్లలో సీట్ల లభ్యతను (ఆక్యుపెన్సీ) పెంచడానికి కూడా సహాయపడుతుంది.
Also, Read: అరుదైన దృశ్యం: ఒకే వేదికపై ధోనీ, గంభీర్, రోహిత్.. ఎందుకంటే? ఫొటోలు వైరల్
ఏ రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది?
ప్రస్తుతానికి ఈ మార్పును దక్షిణ రైల్వే (Southern Railway) జోన్ పరిధిలోని 8 వందే భారత్ రైళ్లలో మాత్రమే అమలు చేశారు. ఆ రైళ్ల జాబితా..
రైలు నం. 20631: మంగళూరు సెంట్రల్ – తిరువనంతపురం సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20632: తిరువనంతపురం సెంట్రల్ – మంగళూరు సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20627: చెన్నై ఎగ్మోర్ – నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20628: నాగర్‌కోయిల్ – చెన్నై ఎగ్మోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20642: కోయంబత్తూరు – బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20646: మంగళూరు సెంట్రల్ – మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20671: మదురై – బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20677: డా.ఎం.జి.ఆర్ చెన్నై సెంట్రల్ – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల ఆదరణ ఎలా ఉంది?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాలలో మొత్తం 144 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, వందే భారత్ రైళ్లు 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 102.01%, 2025-26లో (2025 జూన్ వరకు) 105.03% ఆక్యుపెన్సీ నమోదైందని ఆయన తెలిపారు. ఇది వందే భారత్ రైళ్లపై ప్రయాణికులకు ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది.