Cm Chandrababu: టీడీపీ ఓడిపోదు..! మళ్లీ మళ్లీ పవర్ లోకి వస్తాం..! చంద్రబాబులో అంత కాన్ఫిడెన్స్‌కి కారణమేంటి..
గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్ ఏదైనా డయాస్ మరేదైనా జగన్‌ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు.
Cm Chandrababu: వస్తామ్. మళ్లీ మళ్లీ పవర్‌లోకి వస్తాం. అసలు టీడీపీ ఓడిపోదు. రాసి పెట్టుకోండి. గెలుపు మనదే. ప్రభుత్వంలో ఉండేది కూడా టీడీపీనే. ఇది సీఎం చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చెబుతున్న మాట ఇది. పవర్‌పై బాబు ధీమా వెనుక ప్లానేంటి? రాబోయే ఎన్నికలకు..ఫ్యూచర్ పాలిటిక్స్‌కు చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రాలేంటి? అంత గట్టిగా ఓడిపోబోమని చెప్పడానికి కారణమేంటి?
ఏపీలో పవర్ షిఫ్లింగ్ సిస్టమ్ నడుస్తోంది. విభజన తర్వాత ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైమ్ జగన్ పవర్‌లోకి వచ్చారు. తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఏపీని పాలిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ఇటు కూటమి..అటు వైసీపీ ఎవరి అస్త్రాలు వాళ్లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విపక్షంలో ఉన్న వైసీపీ 2029లో అధికారం తమదేనని ధీమాగా ఉంది. సీఎం చంద్రబాబు మాత్రం టీడీపీ ఎప్పటికీ ఓడదంతే అంటున్నారు.
చంద్రబాబు మాటల్లో ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్..
చంద్రబాబు నోట ఆ మాట వచ్చిందంటే ఆశామాషీ కాదు. ఎందుకంటే గ్రౌండ్ లెవల్ పరిస్థితులకు భిన్నంగా బాబు ఎప్పుడూ మాట్లాడరు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్‌లో నెగెటీవ్ అంశాల మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు. అలాంటిది టీడీపీకి ఓటమే ఉండదన్నట్లుగా బాబు..పార్టీ నాయకులతో చెప్పడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోదు..ఇక నుంచి వచ్చే జరిగే ప్రతీ ఎన్నికలోనూ గెలిచి తీరుతుందని అన్నారట చంద్రబాబు. ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు టీడీపీ గెలిచేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని..ప్రజలు కూడా అలానే స్పందించేలా పార్టీ సమాయత్తం అవుతోందని బాబు చెప్పుకొస్తున్నారు.
ఈసారి అధికారంలోకి వచ్చాక..చంద్రబాబు ప్లానింగ్..అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం మీద ఎక్కడా నెగెటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యలు..ఇచ్చి హామీలు ఇలా అన్నింటిని పూర్తిగా అవగాహన చేసుకున్న బాబు 2024 ఎన్నికల తర్వాత మాత్రం వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు పాలన, ఇటు పార్టీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా మెయింటెన్ చేస్తున్నారు.
కీలక స్కీమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా అమలు..
బాబు అంటే అభివృద్ధి మంత్రమేనని.. సంక్షేమ పథకాలు, పేదలకు ఉచితాలు ఇవ్వరంటూ ఉన్న ప్రచారానికి చెక్ పెట్టి..సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, తల్లికి వందనం, వాహనమిత్ర ఇలా కీలక స్కీమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ..కూటమి పట్టు సడలకుండా ముందుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లోనే కాదు మరో 15ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెబుతున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉంటాయనేది చంద్రబాబు, పవన్ చెబుతున్న మాట.
మరోవైపు వైసీపీ ఇంకా దూకుడు పెంచినట్లుగా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ లీడర్లతో పాటు జగన్ కూడా పెద్దగా జనాల్లోకి రావడం లేదన్న చర్చ ఉంది. పైగా విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది. 2024లో కూటమి దాదాపుగా 60శాతం ఓటు షేర్‌ను రాబట్టింది. ఇందులో ఏ కొంత తగ్గినా కొన్ని సీట్లు తగ్గుతాయే తప్ప అధికారం కోల్పోయేంత సీన్ ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట చంద్రబాబు.
గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్ ఏదైనా డయాస్ మరేదైనా జగన్‌ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు. సేమ్‌టైమ్ అక్రమాలు, అవినీతి చేశారంటూ వైసీపీ లీడర్లకు ఒకరి తర్వాత మరొకరికి ఉచ్చు బిగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ లీడర్లంతా గప్ చుప్ అయిపోయి..మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారట.
ఇక రాజకీయంగా వైసీపీ 2019కు ముందున్నంత పటిష్టంగా ఉందా లేదా? ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది? అందుకు విరుగుడు ఏంటి? అంటూ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ నడిపిస్తున్నారట చంద్రబాబు. జగన్ పాలనను జనాలు ఒకసారి చూసారు కాబట్టి ఆ పార్టీకి ప్రజల నుంచి అంత ఆదరణ దక్కకపోవచ్చన్న లెక్కల్లో ఉందట కూటమి. ఇలా తనదైన మంత్రాంగంతో..ఏపీ పొలిటికల్ గేమ్‌లో బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే టీడీపీదే విజయం అన్నట్లుగా బాబు చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బాబు ధీమానే నిజం కాబోతోందా? ఫ్యూచర్ పాలిటిక్స్ ఎప్పుడు ఎటు వైపు తిరుగుతాయో చూడాలి.
Also Read: భజన చేస్తే సరిపోతుందా? వైసీసీలో సీనియర్ల స్వరం ఎందుకు మారింది? స్వపక్షంలో విపక్షం వాయిస్ దేనికి?
