Air India Crash: సర్వం కోల్పోయాను, ఏ పనీ చేయలేను, కుటుంబంతో మాటల్లేవు- ఎయిరిండియా ప్రమాదంలో బతికిన ఏకైక వ్యక్తి దయనీయ స్థితి..

ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నా. నేను నా గదిలో ఒంటరిగా కూర్చుంటున్నా. నా భార్య, కొడుకుతో కూడా మాట్లాడటం లేదు.

Air India Crash: సర్వం కోల్పోయాను, ఏ పనీ చేయలేను, కుటుంబంతో మాటల్లేవు- ఎయిరిండియా ప్రమాదంలో బతికిన ఏకైక వ్యక్తి దయనీయ స్థితి..

Updated On : November 3, 2025 / 8:48 PM IST

Air India Crash: జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాదంలో అంతా చనిపోయినా.. ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే విశ్వాష్‌కుమార్ రమేష్. దీంతో దేశవ్యాప్తంగా అతడు వైరల్ అయ్యాడు. మృత్యుంజయుడు అంటూ అంటూ అతడి గురించి చెప్పుకున్నారు. తాను అత్యంత అదృష్టవంతుడిని అని విశ్వాష్ కుమార్ కూడా చెప్పుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ విషాదం తర్వాత తాను శారీరకంగా, మానసికంగా అనుభవిస్తున్న బాధలను తెలుపుతూ అతడు కన్నీటిపర్యంతం అయ్యాడు.

ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటున్నానని రమేశ్ వాపోయాడు. తన భార్య కొడుకుతో కూడా మాట్లాడటం లేదని తెలిపాడు. బ్రిటిష్ జాతీయుడైన రమేష్.. ఈ దుర్ఘటనలో తన తమ్ముడు అజయ్ ని కోల్పోయాడు. తన సోదరుడిని కోల్పోవడం రమేశ్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. “నేను నా సోదరుడిని కోల్పోయాను. నా సోదరుడు నాకు వెన్నెముక. కొన్ని సంవత్సరాలుగా అతను అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో నాకు మద్దతుగా ఉన్నాడు” అని రమేష్ కంటతడి పెట్టాడు.

“ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నా. నేను నా గదిలో ఒంటరిగా కూర్చుంటున్నా. నా భార్య, కొడుకుతో కూడా మాట్లాడటం లేదు. నా ఇంట్లో ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం” అని రమేశ్ వాపోయాడు. రమేష్‌కు పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) ఉన్నట్లు నిర్ధారణ అయింది.

శారీరకంగా, మానసికంగా కష్టంగా ఉంది..

“ఈ ప్రమాదం తర్వాత నాకు, నా కుటుంబానికి శారీరకంగా, మానసికంగా చాలా కష్టంగా ఉంది. గత నాలుగు నెలలుగా, మా అమ్మ ప్రతిరోజూ తలుపు బయట కూర్చుని, ఏమీ మాట్లాడకుండా ఉంది. నేను ఎవరితోనూ మాట్లాడటం లేదు. నాకు ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం లేదు. నేను పెద్దగా మాట్లాడలేను. నేను రాత్రంతా ఆలోచిస్తున్నా, మానసికంగా బాధపడుతున్నా. ప్రతి రోజు మొత్తం కుటుంబానికి బాధాకరమైనది” అని రమేశ్ వాపోయాడు.

విమాన ప్రమాదంలో ఫ్యూజ్‌లేజ్‌లోని ఓపెనింగ్ ద్వారా 11A సీటు నుండి తప్పించుకున్నప్పుడు జరిగిన శారీరక గాయాలను అతను వివరించాడు. ”కాలు, భుజం, మోకాలి, వీపులో నిరంతర నొప్పి వేధిస్తోందని, దీని కారణంగా ఏ పని చేయలేకపోతున్నా. డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నా. ఒక్కోసారి సరిగా నడవలేకపోతున్నా” అని రమేశ్ తాను పడుతున్న శారీరక బాధలను పంచుకున్నాడు.

“వారు మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు. ఇది అతని కుటుంబాన్ని నాశనం చేసింది. వారికిప్పుడు సాయం కావాలి” అని స్థానికులు కోరారు. డయ్యూలో రమేష్ తన సోదరుడితో కలిసి నిర్వహించే చేపల వ్యాపారం, విమాన ప్రమాదం తర్వాత కుప్పకూలిపోయింది.

ఎయిరిండియా యాజమాన్యం రమేష్ కు 25 లక్షలు మధ్యంతర పరిహారాన్ని అందించింది. కానీ ఆ డబ్బు అతని తక్షణ అవసరాలను తీర్చడానికి సరిపోదని కుటుంబసభ్యులు అంటున్నారు.

Also Read: మరో ఘోర ప్రమాదం.. ఫుల్లుగా తాగేసి వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్.. 10 మంది మృతి.. 50 మందికి గాయాలు..