Abhay Singh: పెళ్లి చేసుకున్న మహాకుంభ్ ఐఐటియన్ బాబా అభయ్ సింగ్..
తన కొత్త జీవితం గురించి అభయ్ సింగ్ మాట్లాడాడు. తాను, తన భార్య సంతోషంగా ఉన్నామని తెలిపాడు. ప్రస్తుతం నిరాడంబరమైన జీవనశైలిని గడుపుతున్నామని చెప్పాడు.
- Naveen
- Published On : April 6, 2026 / 08:23 PM IST
Abhay Singh: అభయ్ సింగ్..’ఐఐటియన్ బాబా’గా ప్రసిద్ధి చెందాడు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ సందర్భంగా తన విశిష్టమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అభయ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. దీనికి కారణం వివాహం. అభయ్ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. హర్యానాలోని ఝజ్జర్‌లో తన భార్యతో కలిసి కనిపించాడు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న హిమాచల్ ప్రదేశ్‌లోని అఘంజర్ మహాదేవ్ ఆలయంలో తమ వివాహం జరిగిందని వెల్లడించాడు. ఫిబ్రవరి 19న కోర్టు వివాహం ద్వారా తమ బంధాన్ని అధికారికం చేసుకున్నాడు.
తన కొత్త జీవితం గురించి అభయ్ సింగ్ మాట్లాడాడు. తాను, తన భార్య సంతోషంగా ఉన్నామని తెలిపాడు. ప్రస్తుతం నిరాడంబరమైన జీవనశైలిని గడుపుతున్నామని చెప్పాడు. తన భార్య పేరు ప్రతీక అని, ఆమె స్వస్థలం కర్ణాటక అని, ఆమె క ఇంజనీర్ అని వెల్లడించాడు. ఈ దంపతులు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివసిస్తున్నారు.
అభయ్ సింగ్ తన కుటుంబాన్ని కలవడానికి తన స్వస్థలం హర్యానాలోని ఝజ్జర్‌కు వెళ్లాడు. అక్కడ తన తల్లిదండ్రులతో గడిపిన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి, అతను తన తండ్రి ఛాంబర్‌ను సందర్శించాడు. ఆధ్యాత్మికత వైపు మళ్లక ముందు తాను ఒకప్పుడు అక్కడ న్యాయ కేసులను అధ్యయనం చేస్తూ సమయం గడిపిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. జీవితానికి అర్థం కోసం తన అన్వేషణ తనను సైన్స్, టెక్నాలజీకి దూరంగా ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించిందని అతను చెప్పాడు.
అభయ్ ఒక నిరాడంబరమైన వ్యక్తి అని, నిజాయితీపరుడు అని అభివర్ణించింది భార్య ప్రతీక. తాము సుమారు ఏడాది క్రితం కలుసుకున్నామని, ఇప్పుడు సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి కలిసి పనిచేయాలని యోచిస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఒక “సనాతన విశ్వవిద్యాలయాన్ని” స్థాపించాలనే తమ ఆశయం గురించి కూడా ఈ జంట మాట్లాడింది.
ఎవరీ ఐఐటియన్ బాబా?
ఝజ్జర్‌లోని సస్రోలి గ్రామానికి చెందిన అభయ్ సింగ్, ఐఐటి బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత కెనడాలోని ఒక ఏరోస్పేస్ కంపెనీలో నెలకు సుమారు రూ. 3 లక్షలు సంపాదిస్తూ పనిచేశాడు. అయితే తన వృత్తిని వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. 2025 మహాకుంభమేళా సమయంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఒక విజయవంతమైన ఇంజనీర్ నుండి ఆధ్యాత్మికం వైపు నడిచిన అతడి వృత్తాంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read: అక్షయ తృతియ.. ఏరోజు వస్తుంది, ముహూర్తం ఎప్పుడు, ఆరోజున బంగారం ఎందుకు కొనాలి?
