Water Crisis : నీటి సంక్షోభం షురూ.. నీళ్లు వేస్ట్‌చేస్తే రూ.5వేల ఫైన్.. సర్కార్ కీలక ఆదేశాలు.. అక్కడ వాటర్ బంద్

Water Crisis : నాగ్‌పూర్‌లో జలాశయాల్లో నీటి నిల్వలు వాటి సామర్థ్యంలో సుమారు 58శాతానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు నగరపాలక సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Water Crisis

Water Crisis : మహారాష్ట్రలో నీటి కొరత తీవ్రరూపం దాల్చుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతోపాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. నీటిని వృథా చేస్తే భారీ జరిమానాలు విధించడం, అక్రమ నీటి కనెక్షన్లపై కేసులు నమోదు చేయడం, కొన్ని నగరాల్లో నీటి సరఫరాను తగ్గించడం వంటి చర్యలు చేపడుతోంది. నాగ్‌పూర్, పుణె, ఛత్రపతి శంభాజీనగర్ నగరాల్లో పరిస్థితిని బట్టి ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Also Read : AP DSC Notification 2026 : ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2,721 టీచర్‌ పోస్టులతో ప్రాథమిక నోటిఫికేషన్‌.. జిల్లాల వారిగా పోస్టుల వివరాలు ఇవే..

వృథా చేస్తే రూ.5వేలు జరిమానా ..
నాగ్‌పూర్‌లో జలాశయాల్లో నీటి నిల్వలు వాటి సామర్థ్యంలో సుమారు 58శాతానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు నగరపాలక సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాలు కడగడం, రోడ్లు లేదా ఇంటి ఆవరణలను శుభ్రం చేయడం, తోటలకు తాగునీటిని వినియోగించడం, నిర్మాణ పనులకు తాగునీటిని ఉపయోగించడం వంటి చర్యలపై నిబంధనల ప్రకారం ఒక్కో ఉల్లంఘనకు రూ.5,000 జరిమానా విధించనున్నారు. అక్రమ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయడం, నీటి మీటర్లలో అక్రమంగా మార్పులు చేయడంపై తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయనున్నారు. ప్రతి నీటి కనెక్షన్‌కు మీటర్ ఏర్పాటు చేయడంపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు.

పుణెలో వాటర్ బంద్..
పుణెలోనూ నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నారు. నగరానికి నీటిని అందించే ఖడక్‌వాస్లా డ్యామ్ వ్యవస్థలో అక్టోబర్ 12 నాటికి 26.22 టీఎంసీల నీరు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అందుబాటులో ఉన్న నిల్వలను ఎక్కువకాలం వినియోగించుకునేందుకు అక్టోబర్ 16 నుంచి నీటి వినియోగాన్ని కనీసం 10శాతం తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 15 నుంచి ప్రతి గురువారం నగరవ్యాప్తంగా నీటి సరఫరాకు కోత విధించే చర్యలు చేపట్టనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల వాషింగ్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. నిర్మాణ పనులు, తోటలు, స్విమ్మింగ్ పూల్స్ కోసం తాగునీటిని వినియోగించడంపైనా ఆంక్షలు విధించారు.

రోజుకు 164.9 కోట్ల లీటర్ల నీరు ఆవిరి..
మహారాష్ట్రలోని కరువు ప్రభావిత మరాఠ్వాడా ప్రాంతంలోనూ నీటి సమస్య ఆందోళన కలిగిస్తోంది. ఛత్రపతి శంభాజీనగర్‌కు ప్రధాన నీటి వనరుగా ఉన్న జయక్వాడి డ్యామ్ నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా రోజుకు సుమారు 1.649 బిలియన్ లీటర్ల నీరు ఆవిరవుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అక్టోబర్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతుండటంతో నీటి నిల్వలు వేగంగా తగ్గే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

నీటి కొరతను ఎదుర్కొనేందుకు అధికారులు పాత బావులను శుభ్రం చేయడం, పూడిక తీయడం, సౌర విద్యుత్తుతో నడిచే పంపులను ఏర్పాటు చేయడం, శుద్ధి చేసిన మురుగునీటిని పార్కులు, నిర్మాణ పనులకు వినియోగించడం వంటి చర్యలను చేపడుతున్నారు. గృహ సముదాయాలు కూడా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను సక్రమంగా నిర్వహించి, శుద్ధి చేసిన నీటిని తోటలకు, ఫ్లషింగ్‌కు ఉపయోగించాలని సూచిస్తున్నారు. నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, రానున్న నెలల్లో నీటి కొరత మరింత పెరగకుండా అందుబాటులో ఉన్న నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవడమే ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది.