కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 8వ తేదీ వరకు దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టిన సత్యాగ్రహం..CBI కి వ్యతిరేకం కాదు అని, మోదీ ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా తాను దీక్షలో కూర్చున్నట్లు దీదీ చెప్పారు. కోల్‌కతా పోలీసు చీఫ్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు CBI అధికారులు రావడంతో మమతా బెనర్జీ కేంద్రంపై తిరుగుబాటుకు దిగారు. ఆదివారం(ఫిబ్రవరి 3, 2019) రాత్రి నుంచి ఆమె దీక్షలో కూర్చున్నారు.
తాను చేస్తున్న దీక్ష.. రాజకీయానికి సంబంధం లేదని చెప్పారు. వేదికపై సేవ్ ఇండియా అని మాత్రమే ఉందని, తమ పార్టీ పేరు లేదన్నారు. అయితే బెంగాల్‌లో ఈనెల 12వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఆ పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఎటువంటి మైక్‌లు మోగరాదు. ఆ కారణంగా దీదీ తన దీక్షను ఈనెల 8వ తేదీ వరకు చేపట్టనున్నారు.