నువ్వేమైనా పాకిస్తాన్ రాయబారివా: మోడీకి మమతా సూటి ప్రశ్న

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానివా.. లేదా పాకిస్తాన్ రాయబారివా అంటూ ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో పాక్‌తో పోల్చి మాట్లాడుతుండటంపై మోడీని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సిలిగురిలో జరిగిన నిరసన కార్యక్రమంలో మమతా పాల్గొన్నారు. 

‘భారతదేశం ఉన్నతమైన సాంప్రదాయాలు, సంపదలు ఉన్న చాలా పెద్ద దేశం. హిందూస్థాన్ గురించి మాట్లాడకుండా.. ఎందుకని ప్రతీసారి పాకిస్తాన్‌తో పోల్చి దాని గురించే మాట్లాడుతున్నారు. మీరు భారత్‌కు ప్రధానమంత్రా.. లేదా.. పాకిస్తాన్‌కు అంబాసిడరా.. ఎందుకని పాకిస్తాన్‌ను ప్రతి విషయంలోనూ ప్రస్తావిస్తావ’ని ప్రశ్నించారు. 

‘ఎవరైనా వచ్చి ఉద్యోగం లేదని ఇప్పించమని అడిగితే పాకిస్తాన్ వెళ్లమంటాడు. మనకు పరిశ్రమలు లేవని మాట్లాడితే పాకిస్తాన్ వెళ్లమంటాడు. పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ వాళ్లు మాట్లాడాలి. మనం భారతదేశం గురించి మాట్లాడదాం. ఇది మన మాతృభూమి’ అని ఉద్ఘాటించారు. 

’70 సంవత్సరాల స్వతంత్ర్య భారతదేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. సీఏఏపై.. ఎన్నార్సీపై స్పష్టత లేకుండా పోయింది. ప్రధాని మోడీ అమలుచేయడం లేదని అంటుంటే హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు దేశవ్యాప్తంగా అమలుచేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. వారికే స్పష్టత లేదు’ అని మమతా అన్నారు. 

ఈ సభలో మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నా నాతో చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి ముందుకురండి’ అని మమతా పిలుపునిచ్చారు.