మూడు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఇంటా బయటా కష్టాల్ని తెచ్చి పెట్టింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో కాస్తంత సఖ్యతతోనే ఉన్నవారు ఒక్కసారిగా చేయి విదిల్చుకుంటున్నారు. 2024 ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తదుపరి సమావేశం డిసెంబర్ 6న జరగనుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం లేదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాంబ్ పేల్చారు. అంతే కాదు.. తనకు రాష్ట్రంలో వేరే షెడ్యూల్డ్ ఉందని, కావున ఈ సమావేశానికి రాలేనని తేల్చి చెప్పారు.
పీటీఐ ప్రకారం.. డిసెంబర్ 6 న జరగనున్న ఇండియా అలయన్స్ సమావేశం గురించి ఆమెను ప్రశ్నించగా.. “నాకు దీని గురించి తెలియదు. ఉత్తర బెంగాల్‌లో నాకు కొన్ని కార్యక్రమాలు షెడ్యూల్ చేయబడ్డాయి. దీని గురించి నాకు సమాచారం ఉంటే, నేను హాజరయ్యేదానిని. ఉత్తర బెంగాల్‌లో కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్లను. రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నాను. నాకు సమాచారం ఉంటే ఖచ్చితంగా వెళ్లేదాన్ని” అని దీదీ కుండబద్దలు కొట్టారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 6న విపక్ష పార్టీల భారత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో సమావేశానికి భారత కూటమిలో భాగమైన పార్టీలను పిలిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారత కూటమి సమావేశాన్ని పిలవాలని ఇప్పటికే నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని చెప్పారు. డిసెంబరు 6న జరగనున్న సమావేశంలో సీట్ల పంపకం అతిపెద్ద అంశంగా తేలుతుందని, దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.