పడవలోనే తిండి.. అక్కడే పండి.. నీళ్లలోనే క్వారంటైన్

కరోనా ఎఫెక్ట్ ఎక్కడికెళ్లలేం. ఏ పని చేయలేం. తప్పక వెళ్లినా అక్కడ వైరస్ ఏమైనా మనకు అంటుకుంటుందేమోనన్న భయం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 60ఏళ్ల వృద్ధుడు తనకున్న బడ్జెట్ లో సూపర్ క్వారంటైన్ ఐడియా వేశాడు. పడవలోనే వంట చేసుకుని అక్కడే తిని అక్కడే పడుకుని కొద్ది రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ లో గడిపేస్తున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో జరిగింది. 

నిరంజన్ హైదర్.. కీర్తనలు పాడుకుని పొట్టపోసుకుంటాడు. దుబాపారా గ్రామంలో మేనకోడలిని కలిసేందుకు వచ్చి అక్కడే ఇరుక్కుపోయాడు. కానీ, ఆ గ్రామంలో వారి నుంచి అతనికొక సమస్య ఎదురైంది. ఇతర జిల్లా నుంచి వచ్చాడు కాబట్టి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ టెస్టు చేయించుకోవాలంటూ డిమాండ్ చేశారు. రిపోర్టులు లేకుండా గ్రామంలో అడుగుపెట్టొద్దని ఆంక్షలు పెట్టారు. 

‘నేనే వేరే చోటు నుంచి వచ్చానని హెల్త్ చెకప్ చేయించుకోవాలని లేదంటే అనుమతించమన్నారు. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలేమీ లేకుండా చెకప్ కు వెళ్లాను. హెల్త్ వర్కర్లు 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అక్కడే సమస్య వచ్చి పడింది. మేనకోడలి ఇంట్లో ఉంది రెండే గదులు. అక్కడ ఐసోలేషన్ కు కుదరదు. 

అప్పుడే ఆ గ్రామస్థులు చెప్పారు. ఆ ఒడ్డున ఉన్న పడవలో  ఉండమని సలహా ఇచ్చారు. స్మశానం వైపుగా పారే నీరు ఉన్న కాలువలో ఆ పడవ ఉంది. అది కాదు మేనకోడలి ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటే వారి కుటుంబానికి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టిన వాడిని అవుతా. అందుకే పడవలోనే ఉండాలనుకున్నా. ఇక్కడే వండుకుని తింటున్నా’ అని జరిగిన ఘటనపై హైదర్ చెప్పుకొచ్చాడు. 

స్థానికులు ఈ సమాచారం.. అధికారులకు చేరవేయడంతో ఆ హైదర్ అనే వ్యక్తిని క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు. 

Also Read | చైనా చాలా విషయాలు దాచిపెట్టింది: ట్రంప్