రోడ్డుపై కార్లు బైకులు వంటి వాహనాలు వెళుతున్నాయి. సడెన్ ఓ కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. తరువాత మరో యువతి కూడా దిగింది. అలా దిగిన వ్యక్తి నడిరోడ్డుపై తన కారుకు నిప్పంటించాడు. ఆ తరువాత తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటన బుధవారం (సెప్టెంబర్ 25) బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ఉత్తరప్రదేశ్ లోని మధురలో జరిగింది.
అతని పేరు శుభం చౌదరి. ఓ యువతితో కలిసి కారులో ప్రయాణిస్తూ..మధుర రోడ్డుపై కారు ఆపాడు. యువతితో సహా కారులోంచి కిందికి దిగాడు. తరువాత ఏమైందో ఏమో చౌదరి తన కారుకు నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తు మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న కొంతమంది వీరి చేసిన పనిని గుర్తించి అడ్డుకోవటానికి యత్నించారు. దగ్గరకొచ్చారంటే కాల్చి పడేస్తానంటూ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించాడు. దీంతో చేసేందేమీ లేక ఎక్కడివారక్కడ నిలబడిపోయారు. వీడికేమన్నా పిచ్చా? లేక పొగరా? అనుకున్నారు. ఈ ఘటనపై అక్కడున్నవారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు శుభం చౌదరిని అతని కూడా ఉన్న మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై మధుర సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ శలాబ్ మాథుర్ మాట్లాడుతూ..శుభం చౌదరికి అదుపులోకి తీసుకున్నామనీ..అతని కూడా ఉన్న యువతి దగ్గర కూడా మరో తుపాకీ ఉందనీ దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.పబ్లిక్ ను భయాందోళనకు గురిచేసేలా ఎందుకు ప్రవర్తించావనీ ప్రశ్నించగా..చౌదరి పొంతన లేకుండా సమాధానం చెప్పాడు. ఆమె నా భార్య అని ఒకసారి..సిస్టరనీ..కాదు కాదు..బిజినెస్ పార్టనర్ అని కాసేపు పిచ్చి పిచ్చిగా సమాధానం చెప్పాడు. పిచ్చి పిచ్చిసమాధానాలతో కావాలనే చేస్తున్నాడనే అనుమానంతో..శుభం చౌదరి గురించి విచారించగా అతను డిప్రెషన్ లో ఉన్నట్లుగా తెలిసిందని తెలిపారు.
శుభం చౌదరికి గతంలో మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని..నవంబర్‌లో వివాహం చేసుకోబోతున్నాడని తెలిసింది. కాకపోతే దీంట్లో మరో ట్విస్ట్ ఏంటంటే ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయితో చౌదరికి పెళ్లి ఇష్టం లేదు. ప్రస్తుతం కారులో ఉన్న యువతిని చౌదరి వివాహం చేసుకోవనుకుంటున్నట్లుగా తెలిసింది. తనకు ఇష్టం లేని అమ్మాయితో పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి చౌదరి తీవ్ర మానసిక వేదనకు గురైనట్లుగా తెలిసిందని..దర్యాప్తును కొనసాగిస్తున్నామని తెలిపారు.