లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంతో ములాయం తరపున మాయావతి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
ఉత్తరప్రదేశ్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకసారి విడివిడిగా పోటీ చేసిన పార్టీలు…మరొక సందర్భంలో కలిసి పోటీ చేస్తాయి. కొన్ని సందర్బాల్లో శత్రువులు మిత్రులవుతారు..మిత్రులు శత్రువులు అవుతారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంతో ములాయం తరపున మాయావతి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. 24 ఏళ్ల తర్వాత ములాయం, మాయవతి కలిసి పని చేయనుండటం ఇదే మొదటిసారి.
Read Also : పోత్తుల్లో భాగంగా పవన్ కీలక భేటీ.. క్లారిటీ వచ్చేస్తుంది
ఎస్పీకి కంచుకోటగా ఉన్న మైన్‌పురి నుంచి ములాయం పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గంలో మాయావతి ప్రచారం చేయనున్నట్లు ఎస్పీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు. మైన్‌పురి ర్యాలీలో మాయావతి, అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు. బీజేపీని ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతోనే ఎస్పీ, బీఎస్‌పీ కూటమి బరిలోకి దిగిందన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్, మాయావతి కలిసి ఏప్రిల్-మే మధ్య 11 ర్యాలీల్లో పాల్గొంటారని, కూటమి అభ్యర్థుల తరఫున కలిసే ప్రచారం సాగిస్తారని రాజేంద్ర చౌదరి తెలిపారు. ఈ సంయుక్త ర్యాలీల ద్వారా రెండు పార్టీల కార్యకర్తలు విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా బీజేపీని ఓడించాలనే స్పష్టమైన సంకేతాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. మాయావతి, ములాయం సింగ్ కలిసి ఉన్న ఫోటోలతో ప్రచార సామాగ్రిని కూడా సిద్ధం చేస్తున్నారు.
ఎస్పీ, బీఎస్‌పీ ఎన్నికల ప్రచార ప్రణాళిక ప్రకారం…అఖిలేష్, మాయావతి కలిసి ఏప్రిల్ 7న షహరాన్‌పూర్‌లోని డియోబంద్‌లో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 17న బదౌన్, 16న ఆగ్రా, 19న మైన్‌పుర్, 20న రాంపూర్, ఫిరోజాబాద్‌లలో ఉమ్మడిగా ప్రచారం సాగించనున్నారు. కాగా ఫిరోజాబాద్‌లో పోరు హోరాహోరీగా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక్కడ అఖిలేష్ యాదవ్ కజిన్ ఎస్పీ-బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయనకు పోటీగా అఖిలేష్ చిన్నాన్న, పీఎస్‌పీ-ఎల్ అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఎస్పీ, బీఎస్‌పీ పొత్తులో భాగంగా 37 స్థానాల్లో ఎస్పీ పోటీ చేస్తోంది. 38 స్థానాల్లో బీఎస్‌పీ అభ్యర్థులు బరిలో దిగనున్నారు. మరో భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్‌డీ 3 సీట్లలో పోటీ చేస్తోంది. అమేథీ, రాయబరేలీ సీట్లను కాంగ్రెస్‌కు వదిలేసినట్టు కూటమి నేతలు చెబుతున్నారు.