మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-
మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించి సంఖ్యా బలం హాట్ టాపిక్ గా మారింది.
క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ… తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ పంపిన ఆహ్వానానికి రుజువు చూపగలదా.. ఫడ్నవీస్ గవర్నర్‌కి ఇచ్చిన ఎమ్మెల్యేల మద్దతు పత్రాలు సమర్పించగలరా.. ఒక వేళ సమర్పించకపోతే ఏం జరుగుతుంది అనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం బలపరీక్ష కంటే ముందే మరో పరీక్ష ఎదుర్కోనుంది. సర్కార్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సోమవారం ఉదయం 10.30కు విచారణ జరపనున్న కోర్టు… ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన లేఖతోపాటు… బీజేపీ సంఖ్యా బలం లేఖను పరిశీలించనుంది. ఆ తర్వాత బలపరీక్షపై నిర్ణయం తీసుకోనుంది. దీంతో మహారాష్ట్రలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.
288మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కి 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి బీజేపీ అన్ని దారులు వెతుకుతోంది. 170 నుంచి 180మంది ఎమ్మెల్యేల మద్దతు లక్ష్యంగా పెట్టుకుంది. తమకు 170 నుంచి 180 ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని.. విశ్వాసపరీక్ష సులభంగా పాస్ అవుతామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.
బీజేపీకి మద్దతిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన నలుగురు సీనియర్లు రాధాకృష్ణ విఖే పాటిల్, నారాయణ్ రాణే, గణేష్ నాయక్, బాబన్‌రావ్ పచ్‌పుట్ లకు కీలక బాధ్యతలు అప్పగించింది బీజేపీ. కాంగ్రెస్, ఎన్సీపీలోని ఎమ్మెల్యేలతో ఉన్న పరిచయాల ద్వారా సంప్రదింపులు జరిపి.. బీజేపీకి అనుకూలంగా ఉండేలా చూడాలని కోరింది. ఫడ్నవీస్ సర్కార్ కి సపోర్ట్ చేసేలా వారిని ఒప్పించాలంది. అంతేకాదు.. బీజేపీలో చేరాలని అనుకుంటున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపాల్సిందిగా కోరింది. మరోవైపు బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మద్దతు కూడగట్టేందుకు జల వనరుల మంత్రి గిరీష్ మహాజన్ ను రంగంలోకి దింపారు.
బీజేపీకి సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 15మంది స్వతంత్రులు మద్దతుగా ఉన్నారు. వీరిలో 11మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఉన్నాయి. దీనికి మద్దతుగా ఎన్సీపీకి చెందిన 27 నుంచి 30 మంది ఎమ్మెల్యేల నుంచి మద్దతు లేఖలు తేవాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు బాధ్యతలు అప్పగించింది బీజేపీ. ఇలా బీజేపీ సంఖ్యా బలం 143 నుండి 146 వరకు వెళుతుంది. దీనికి అదనంగా 34 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలని బీజేపీ స్కెచ్ వేసింది.
“స్పీకర్‌ను ఎన్నుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. స్పీకర్ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది ”అని బీజేపీ మాజీ మంత్రి అన్నారు. అయితే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పోరాటం చేయడంతో బలపరీక్ష రోజున సురక్షితంగా ఉండటానికి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది.
ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర, చిన్న పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలని బీజేపీ చూస్తోంది. అలాంటి వాళ్లు 29మంది ఉన్నారు. వారిలో 8మంది శివసేనకు మద్దతిచ్చినవారు ఉన్నారు. శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేకు మద్దతు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యేల్లో చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పారు. తమకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఉన్నాయని బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఎస్పీ, ఎంఐఎం ఎమ్మెల్యేలను మినహాయించి 19-20 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని భావిస్తున్నాము అని విశ్వాసం వ్యక్తం చేశారు.
మొత్తంగా బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిలబడాలంటే అజిత్ పవార్ మీదే ఆధారపడి ఉందని కమలనాథులు అంటున్నారు. తన అంకుల్ శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది మద్దతు ఆయన కూడగడతారో చూడాలి.