మరి కొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల పురస్కరించుకొని మోడీ ప్రభుత్వం బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. కోటికి పైగా ఉద్యోగాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు 1.95 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణాలు, రూ.30వేల కోట్లతో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థకు మెరుగులు, చమురు ఉండే ప్రదేశాలు కనుగొనేందుకు టెక్నిక్స్‌తో కూడిన పథకాలను ప్రకటించింది. వీటిపై 2019, ఫిబ్రవరి 19 మంగళవారమే యూనియన్ కేబినెట్ ఆమెదాన్ని కూడా తెలియజేసినట్లు వెల్లడించింది.
ఆర్థిక వ్యవహారాలపై చర్చించిన కేబినెట్ కమిటీతో పాటు సీసీఈఏ కలిసి మొత్తం 27 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల నుంచి తమ ఉత్పత్తులను తామే 25 శాతం వరకూ అమ్ముకోవచ్చని అనుమతినిచ్చింది. 40వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, రైతుల కోసం కొత్త సోలార్ పవర్ స్కీమ్‌లు ప్రకటిస్తూ.. మరిన్ని కీలక పథకాలకు మూడేళ్ల కాలపరిమితి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోటి ఉద్యోగాల ప్రక్రియ, 2 కోట్ల ఇళ్ల నిర్మాణం అనేది నిరంతరం సాగుతుందని.. లక్ష్యం సాధించటానికి ఎంతో సమయం లేదని వెల్లడించారు కేంద్రమంత్రి జైట్లీ.
9 శాతం ఉన్న డీఏ అలోవెన్స్‌ను మరో 3శాతం పెంచి 2019 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ మేర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ‘ఇవన్నీ మధ్యలో ఉన్న విషయాలు. ఈ నిర్ణయాలన్నీ కార్యరూపంలోకి రావాలంటే కొద్ది వారాలు కాదు. మరికొన్ని నెలల సమయం పట్టొచ్చు’ అని వెల్లడించారు.
చివరిగా ‘భారత ప్రజాస్వామ్యం అంత చేతకానిది కాదు. సరైన సమాధానం చెప్తుంది’ అంటూ ముగించారు.