Uttar pradesh : యూపీలో గాలివాన బీభత్సం.. 60మందికిపైగా మృతి.. గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తి.. వీడియో వైరల్..
Uttar pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 60మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- May 14, 2026 / 10:14 AM IST
Uttar pradesh
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల బీభత్సం
- 60మందికిపైగా మృతి.. భారీగా ఆస్తినష్టం
- సీఎం యోగి ఆధిత్యనాథ్ అధికారులకు కీలక ఆదేశాలు
Uttar pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ భీకర వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 60మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ మూడు జిల్లాల ప్రజలకు శుభవార్త..
ముఖ్యంగా ప్రయాగ్ రాజ్, కాన్పూర్ దేహాత్, ఫతేహ్‌పూర్ సహా అనే ప్రాంతాల్లో చెట్లు, గోడలు కూలిపోవడంతోపాటు పిడుగుల కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. భదోహీ జిల్లాలో భారీ ఈదురుగాలుల కారణంగా పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా.. ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బదౌన్ జిల్లాలో ఓ ఇంటి మట్టిగోడ కూలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు సాగు చేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలివాన బీభత్సంతో పలు రకాల పంటలు నేలవాలడంతో రైతులకు భారీ నష్టం సంభవించింది. తుపాను ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా పరిస్థితిపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. విపత్తుల కారణంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పంట నష్టంపై అంచనా వేయాలని, అందుకు అనుగుణంగా పంట నష్టపరిహారంను రైతులకు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిక సహాయక చర్యలు వేగంగా అందించాలని వర్ష ప్రభావిత జిల్లాల అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
భారీ ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ ప్రాంతంలో గాలిదుమారం సమయంలో హోర్డింగ్ ను పట్టుకున్న వ్యక్తి గాల్లోకి ఎగిరిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాక.. పెద్దపెద్ద చెట్లు ఒక్కసారిగా కూలిపోయి కార్లు, భవనాలపై పడిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
