రైతుల కన్నా ఎక్కువ : దేశంలో పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు

దేశంలో ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. భారత్ లో రైతుల ఆత్మహత్యల సంఖ్య కన్నా నిరుద్యోగుల ఆత్మహత్యల సంఖ్య అధికంగా పెరినట్లు ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన డేటా తెలిపింది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. సరైన ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకపోవడం,భవిష్యత్తుపై బెంగ వంటి వివిద కారణాలతో నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. 2017,2018లో నిరుద్యోగుల ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం…2018లో మొత్తం 1లక్షా 34వేల 516మంది ఆత్మహత్య చేసుకోగా..అందులో 10,349(7.7%)మంది వ్యవసాయ రంగం నుంచి ఆత్మహత్యలు కాగా, 12,936(9.6%)మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక 2017లో అయితే మొత్తం 1లక్షా 29వేల 788మంది ఆత్మహత్య చేసుకోగా…అందులో 10,655(8.2%)మంది రైతుల ఆత్మహత్యలు ఉండగా, 12,241(9.4%)మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో మొత్తం 1లక్షా 31వేల 8 ఆత్మహత్యలు రికార్డ్ అవగా, అందులో 11,379(8.7%)మంది రైతులు,వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకోగా..11,173(8.5%)మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇక 2015లో మొత్తం 1లక్షా 33వేల 623మంది ఆత్మహత్యకు పాల్పడగా,అందులో 12,602(9.4%)మంది వ్యవసాయ రంగం నుంచి ఆత్మహత్యకు పాల్పడినవారు ఉండగా..10,912(8.2%)మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక 2014లో గవర్నమెంట్ రికార్డుల ప్రకారం…మొత్తం ఆత్మహత్యలలో నిరుద్యోగుల ఆత్మహత్యల శాతం 7.5ఉండగా,వ్యవసాయం రంగం నుంచి ఆత్మహత్య చేసుకున్న వారి శాతం 4.3గా ఉంది. అంటే క్రమంగా దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగుల ఆత్మహత్యల కేటగిరీలో 82శాతం కన్నా ఎక్కువమంది బాధితులు మగవాళ్లే ఉన్నారు. కేరళలో(1,585) అత్యధికంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు(1,579),మహారాష్ట్ర(1,260),కర్ణాటక(1,094)లు ఉన్నాయి.

 2018లో వ్యవసాయ రంగంలో నమోదైన మొత్తం ఆత్మహత్యలలో 5,763మంది రైతులు,సాగుదారులు ఉండగా,4,586మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. రైతులు,సాగుదారుల ఆత్మహత్యలలో 5,457మంది మగవాళ్లు ఉండగా, 306మంది మహిళలు ఉన్నారు. ఇక వ్యవసాయ కూలీల్లో అయితే 4,071మంది పురుషులు ఉండగా,515మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఆత్మహత్యలు(34.7%)నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటక(23.2%),తెలంగాణ(8.8%),ఆంధ్రప్రదేశ్(6.4%),మధ్యప్రదేశ్(6.3%)ఉన్నాయి. వెస్ట్ బెంగాల్,ఒడిషా,గోవా,చండీఘర్,మేఘాలయ,ఉత్తరాఖండ్ లో “జీరో” వ్యవసాయ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. వెస్ట్ బెంగాల్,ఒడిషలో 2017లో జీరో వ్యవసాయ ఆత్మహత్యలు నమోదయ్యాయి. 

ట్రెండింగ్ వార్తలు