పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై రైల్వే మంత్రి సురేశ్ అంగడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టంపై ఆందోళన చేస్తూ కనిపిస్తే స్పాట్ లో షూట్ చేసేయమని ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. ‘ఓ మంత్రిగా చెప్తున్నా. ఆందోళన చేస్తూ కనిపిస్తే స్పాట్‌లోనే షూట్ చేసేయండి’ అని వెల్లడించారు. అస్సాం, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌లో పౌరసత్వ చట్ట(Citizenship (Amendment) Act)పై ఆందోళనలు జరుగుతుండటంతో ఆయన స్పందించారు.
‘నా 13లక్షల మంది ఉద్యోగులు రాత్రి పగలూ కష్టపడి రైల్వే అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. శుభ్రత, సమయానికి రావడం వంటివన్నీ నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రోత్సాహంతో కొందరు సాంఘిక విద్రోహ శక్తులు దేశంలో సమస్యలు సృష్టిస్తున్నారు. ఈ పౌరసత్వపు చట్టం ఎవరికీ హాని కలిగించదు’
‘అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీలుగా ఉన్న వారికే భారత్‌లో ఉండే హక్కులు కల్పించాం. స్థానిక మైనారీలు, కొన్ని సామాజిక వర్గాల వారు అనవసరమైన రాద్దాంతం చేసి సమస్యలు సృష్టించి దేశ సంపదను నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు దీనిని ప్రోత్సహిస్తున్నాయనే విషయం గుర్తుంచుకోవాలి. దీనిని ఖండిస్తున్నాను’
‘జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ను, రైల్వే అధికారులను హెచ్చరిస్తున్నా. రైల్వేతో కలిపి పబ్లిక్ ప్రాపర్టీని పాడుచేయాలని అనుకుంటే వారికి రైల్వే మంత్రిగా అక్కడే షూట్ చేయమని ఆదేశాలిస్తున్నా. ఒక రైలు తయారుచేయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఉద్యోగులు రక్తాన్ని చెమటగా మార్చి రైల్వే పనులు చేస్తుంటారు. సంపదను పాడు చేసేలా రాళ్లు విసరడం, నిప్పు పెట్టడం లాంటివి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు సర్దార్ వల్లభాయ్ పటేల్‌లా చర్యలు తీసుకుంటాం’ అని అంగడీ చెప్పారు.