ఆపదలో ఉన్నవారికి ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ఫోన్ చేస్తే వెంటనే వాలిపోయేది ఒక్క పోలీస్ మాత్రమే. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు
ఆపదలో ఉన్నవారికి ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ఫోన్ చేస్తే వెంటనే వాలిపోయేది ఒక్క పోలీస్ మాత్రమే. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు కాబట్టే వారిని రక్షకభటుడు అంటారు. పోలీసుల ధైర్యసాహసాలు, ఔదార్యం, సేవాగుణం గురించి ఎన్నో వార్తలు చదివాం, కళ్లారా చూశాం. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని కాపాడటానికి ఓ పోలీసు చూపిన ఔదార్యం, సాహసం అందరి మన్ననలు పొందుతోంది. వాహనాల రాకపోకలకు అనువుగా లేని ప్రాంతంలో గాయపడిన వ్యక్తిని భుజాల మీద మోస్తూ, పట్టాల మీద ఏకంగా 1.5 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ హోషంగాబాద్ జిల్లా రావణ్ పిపల్‌గాన్ గ్రామ సమీపంలో వెళ్తున్న రైల్లోంచి అజిత్ అనే యువకుడు(20) ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దాన్ని గమనించి ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కానిస్టేబుల్ పూనమ్ బిల్లోర్, డ్రైవర్ రాహుల్ సకల్లేతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతం రోడ్డు మార్గానికి అనువుగా లేదు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బిల్లోర్ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే రక్తమోడుతున్న అజిత్‌ను భుజాల మీద వేసుకొని పట్టాల మీద పరిగెత్తాడు. ఏకంగా 1.5 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. పక్కనున్న పట్టాల మీద రైలు వెళ్తున్నా అదేమీ పట్టించుకోకుండా బిల్లోర్.. బాధితుడిని పోలీసు వాహనం దగ్గరికి చేర్చాడు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందించిన వ్యక్తే ఆ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శభాష్ పోలీస్ అని, సెల్యూట్ పోలీస్, రియల్ హీరో అని నెటిజన్లు.. కానిస్టేబుల్ బిల్లోర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Watch: MP police constable carries man who fell off train on shoulder, saves life pic.twitter.com/4t1yw3QzD9
— The Indian Express (@IndianExpress) February 23, 2019