ఆ పెళ్లికి వచ్చిన అతిథుల దర్పం..వైభోగం..విలాసం.. ఆ వివాహ వేడుక సొగసును వర్ణించటానికి మాటలు చాలవు. మూడు నెలల క్రితమే అభినవ కుబేరుడు ముకేశ్ ముద్దుల తనయ ఈశా వివాహం ఇంకా కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది..అప్పుడే దేశ, విదేశీ ప్రముఖుల సందళ్లతో తనయుడు ఆకాశ్ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు అంబానీ దంపతులు.చిన్ననాటి స్నేహితురాలు, రోజీ బ్లూ డైమండ్స్ సీఈఓ రసెల్ మెహతా తనయ శ్లోకా మెహతాను జీవిత భాగస్వామిని చేసుకున్నాడు ఆకాశ్. మార్చి 9 రాత్రి ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో వీరి వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. సాయంత్రం మొదలైన వివాహ వేడుక అర్థరాత్రి వరకు అట్టహాసంగా కొనసాగుతునే ఉంది.
తొలుత తన తల్లిదండ్రులు ముకేశ్, నీతాలు, సోదరి ఈశా అంబానీ, బావ ఆనంద్ పిరమాల్, తమ్ముడు అనంత్‌తో కలిసి తాత ధీరూబాయ్ అంబానీ చిత్రపటానికి ఆకాశ్ నివాళులు అర్పించారు. తరువాత నాయనమ్మ కోకిలా బెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మరోపక్క బాబాయ్ అనిల్ అంబానీ, పిన్ని టీనా అంబానీ, వీరి తనయులు జై అన్షూల్, జై అనుమోల్‌లు దగ్గరుండి పెళ్లి పనులను పర్యవేక్షిస్తూనే మరోవైపు అతిథులకు దగ్గరుండి స్వాగతం పలికారు.
ఆకాశ్ అంబానీ సంప్రదాయ దుస్తుల్లో వరునిగా మెరిసిపోయారు. బారాత్‌లో గుర్రంపై ఊరేగుతూ నృత్యాలు, బ్యాండు బాజాల హోరు మధ్య జియో వరల్డ్ సెంటర్‌లోని వివాహ వేదికకు చేరుకున్నారు. ఓ గంటన్నర పాటు వేదికంతా ఆటపాటలు, నృత్యాలు, సందళ్లతో హోరెత్తిపోగా..వేద మంత్రాలు, ఆశీర్వచనాల నడుమ సంప్రదాయ రీతిలో శ్లోకాను ఆకాశ్ పరిణయమాడారు. అతిథుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రసిద్ధ వంటకాలను ఏర్పాటు చేసి ఆతిథ్యంలోనూ తమకు తామే సాటి అని చాటారు అంబానీలు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ వివాహ అనంతర విందు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి.
అతిథులంతా ఘనులే
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, చెర్రీ బ్లెయిర్, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్, టాటా సన్స్ గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, టాటాగ్రూపు ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, ఆర్సెలర్ మిత్తల్ అధినేత లక్ష్మీ మిత్తల్, రజనీకాంత్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రా, సచిన్ తెందూల్కర్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.