Maratha Quota Protest: మహారాష్ట్రలో తీవ్ర స్థాయికి చేరిన రిజర్వేషన్ పోరాటం.. రోడ్లు, రైల్వే అన్నీ బ్లాక్

సోమవారం మధ్యాహ్నం బద్నాపూర్ తహసీల్‌లోని షెల్గావ్‌లోని రైల్వే గేట్ వద్ద మరాఠా వర్గానికి చెందిన కొందరు యువకులు రైళ్లను ఆపడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ట్రాక్‌లపై కూర్చున్నారు.

Maratha Quota Protest: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారింది. నిరసన నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లు సహా కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బీడ్ జిల్లాలో ఈ హింసాత్మక సంఘటనలు తీవ్రంగా ఉన్నాయి. హింస కారణంగా బీడ్‌లో కర్ఫ్యూ విధించారు. ఇక మంగళవారం కూడా నిరసన తీవ్ర స్థాయికి చేరుకుంది. నిరసనకారులు ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు దిగ్భంధించారు. దీంతో ఆ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇక రైల్వే సేవల్ని కూడా అడ్డుకున్నారు.

కర్ఫ్యూ అనంతరం ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని బీడ్ కలెక్టర్ దీపా ముధోల్ ముండే తెలిపారు. ‘‘రాత్రి నుంచి ఇక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. హింస కారణంగా అన్ని దుకాణాలు, మార్కెట్లు మూసివేయబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‭లో మొగొల్లు లేరా? మిర్యాలగూడలో కేసీఆర్.. ప్రజలపై వరాల జల్లు

బీడ్ ఎస్పీ నంద్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు 40 మందికి పైగా అరెస్టు చేశాము. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. గత రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ఎలాంటి కేసు నమోదు కాలేదు. పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 144 సెక్షన్ విధించాము’’ అని అన్నారు. సోమవారం రాత్రి మరాఠా రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో బీడ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ జనసమూహాన్ని నిలువరించేందుకు పోలీసు బృందాలను మోహరించారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో మరాఠా రిజర్వేషన్లపై నిరసనల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలోని కిటికీ అద్దాలు, ఫర్నీచర్ దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 452, 427, 120B, 143, 144 కింద 10 నుంచి 15 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Pakistan cricketers : రుచుల‌ను ఆస్వాదిస్తున్న పాక్‌ఆట‌గాళ్లు.. ఏ బిర్యానీ బాగుంది..? హైద‌రాబాదా..? కోల్‌క‌తానా..?

మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి మహారాష్ట్రలో హింస వేగంగా పెరుగుతోంది. జల్నా జిల్లాలో పంచాయతీ సమితి కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు ‘ఏక్ మరాఠా, ఏక్ మరాఠా’ అంటూ నినాదాలు చేస్తూ పంచాయతీ సమితి కార్యాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేయడం ప్రారంభించారు. మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు దగ్ధమయ్యాయి.

మరో సంఘటనలో, సోమవారం మధ్యాహ్నం బద్నాపూర్ తహసీల్‌లోని షెల్గావ్‌లోని రైల్వే గేట్ వద్ద మరాఠా వర్గానికి చెందిన కొందరు యువకులు రైళ్లను ఆపడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ట్రాక్‌లపై కూర్చున్నారు. అనంతరం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇతర రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సంభాషణ అనంతరం ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమకారుడు మనోజ్ జరంగే చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆందోళనకారులు హింసకు దూరంగా ఉండాలని కోరారు.