కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ సోదాలు జరిగే అవకాశముందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించి 24గంటలు తిరగకముందే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు చేశారు. మాండ్యా, మైసూరు, హసన్, బెంగళూరులోని మంత్రి నివాసం, కార్యాలయం, నీటిపారుదలశాఖ, పీడబ్ల్యూడీ కార్యాలయాలు, కాంట్రాక్టర్ల ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. అలాగే కుమారస్వామి తమ్ముడు రేవణ్ణ అనుచరుల ఇళ్లతో సహా 12 ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహించారు.
రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతాయని సీఎం కుమారస్వామి ముందే చెప్పారు. ‘దేశంలోని పలు ప్రాంతాల నుంచి 200-300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రాష్ట్రానికి వచ్చినట్లు నాకు పక్కా సమాచారం అందింది. ఐటీ దాడుల కోసమే వారిని రాష్ట్రానికి పిలిపించారు. రాష్ట్రంలోని పలు మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల్లో ఈ దాడులు జరిగే అవకాశం ఉంది’ అని కుమారస్వామి వెల్లడించారు.
అలాగే ఐటీ దాడులను సర్జికల్ స్ట్రైక్‌గా కుమారస్వామి అభివర్ణించారు. ఐటీ అధికారులతో ప్రధాని మోడీ ఇప్పుడు చేస్తున్నదే రియల్ సర్జికల్ స్ట్రైక్ అని, తన రివేంజ్ తీర్చుకోవడానికి ప్రధాని మోడీ ఇటువం టి చర్యలకు పాల్పడుతున్నాడని కుమారస్వామి విమర్శించారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయాలని చూస్తే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీలా తాను కూడా ధర్నాకు దిగుతానంటూ ఆయన హెచ్చరించారు.